అనారోగ్యం మాట నిజ‌మే.. కానీ..? త‌న ఆరోగ్య స్థితిపై స్పందించిన పోసాని..!

320

ప్ర‌ముఖ తెలుగు న‌టుడు, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు, వైకాపా నేత పోసాని కృష్ణ ముర‌ళి అనారోగ్యం కార‌ణంగా ఇటీవ‌లే ఆసుప‌త్రిలో చేరిన విష‌యం విదిత‌మే. త‌న ఆరోగ్యంపై వ‌స్తున్న వార్త‌ల‌కు గాను పోసాని కృష్ణముర‌ళి స్పందించారు.

ప్ర‌ముఖ తెలుగు న‌టుడు, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు, వైకాపా నేత పోసాని కృష్ణ ముర‌ళి అనారోగ్యం కార‌ణంగా ఇటీవ‌లే ఆసుప‌త్రిలో చేరిన విష‌యం విదిత‌మే. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, అందుకే హాస్పిట‌ల్‌లో చేరార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇక కొన్ని సైట్ల‌తో ఆయ‌న ఏకంగా చ‌నిపోబోతున్నార‌ని కూడా రాశాయి. అయితే త‌న ఆరోగ్యంపై వ‌స్తున్న వార్త‌ల‌కు గాను పోసాని కృష్ణముర‌ళి స్పందించారు. ఆయ‌న తాజాగా మీడియాతో త‌న ఆరోగ్యంపై మాట్లాడారు.

త‌న‌కు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగుండ‌డం లేద‌ని, ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయ‌ని.. త‌న ఫ్రెండ్స్ త‌న‌కు ఈ విష‌యాన్ని చెప్పార‌ని పోసాని అన్నారు. అయితే త‌న‌కు అనారోగ్యం సంభవించిన విష‌యం క‌రెక్టే కానీ.. మ‌రీ చ‌నిపోయేంత ప‌రిస్థితి రాలేద‌న్నారు. తాను య‌శోదా హాస్పిట‌ల్‌లో డాక్ట‌ర్ ఎన్‌వీ రావు ఆధ్వ‌ర్యంలో కోలుకున్నాన‌ని, ఆయ‌న త‌న‌ను ఆరోగ్య‌వంతుడిగా చేశార‌ని పోసాని అన్నారు.

త‌న ఆరోగ్యంపై అభిమానులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌ని, మ‌రో 10 రోజుల్లో షూటింగ్‌ల‌లో పాల్గొంటాన‌ని పోసాని తెలిపారు. ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాన‌న్నారు. త‌న‌కు న‌డుము కింది భాగంలో.. గజ్జ‌ల్లో ఇబ్బందిగా ఉంద‌ని.. అందుకే స‌రిగ్గా న‌డ‌వ‌లేక‌పోతున్నాన‌ని తెలిపారు. దీంతో య‌శోద ఆసుప‌త్రి వైద్యులు త‌న‌కు ఆప‌రేష‌న్ చేయించుకోవాల‌ని చెప్పార‌ని.. అయితే గ‌తంలో మ‌హ‌ర్షి సినిమా షూటింగ్‌లో ఉన్నందున ఆప‌రేష‌న్‌కు వీలు కాలేద‌ని, కానీ ఇప్పుడు ఆప‌రేష‌న్ చేయించుకున్నాన‌ని పోసాని తెలిపారు. త‌న ఆరోగ్యంపై ఎలాంటి చింతా అవ‌స‌రం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు..!