తెలంగాణ ప్రజలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. మరోవైపు ఈ నెల 5వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. బుధ, గురు వారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ రెండ్రోజుల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ అధికారులు. ఇక గురువారం రోజున ఉత్తర, పశ్చిమ తెలంగాణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చినట్లు వివరించారు. ఏప్రిల్ 4, 5వ తేదీల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.