విద్యుత్తు సరఫరా నిలిచిపోతే చాలా పనులు ఆగిపోతాయి. ఎవరికి ఫిర్యాదు చేసినా సరైన రీతిలో స్పందించరు. కరెంట్ సమస్యల పరిష్కారం కోసం ఎర్రగడ్డలోని స్కాడా కార్యాలయంలో 1912 నంబరుతో 24 గంటలూ పనిచేసే ఓ కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ కాల్‌సెంటర్ సామర్థ్యం 30 సీట్లు మాత్రమే కావడంతో వారు ఏకకాలంలో 60 కాల్స్‌కు మించి స్పందించడం లేదు. ఈదురు గాలులు, వర్షాల లాంటి సమయాల్లో వేల కొద్ది కాల్స్ వస్తుండడంతో ఇలాంటి సమయాల్లో వినియోగదారులకు లైన్ దొరకడం లేదు. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా టీఎస్‌ఎస్పీడీసీఎల్ కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది.
టీఎస్‌ఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా సమస్యలను ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. టీఎస్‌ఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయడం కూడా చాలా తేలిక. కొన్ని సెకన్లలోనే ఫిర్యాదును నమోదు చేయవచ్చు. కాగా యాప్‌లో యూనిక్ సర్వీస్ నంబరు, మొబైల్ నంబరు ముందే రిజిస్టరై ఉంటాయి. కన్జూమర్ సర్వీసెస్‌పై క్లిక్ చేయగానే నో పవర్ కంప్లైంట్ అని ఉంటుంది. దానిపై నొక్కగానే యూనిక్ సర్వీస్ నెంబరు, వినియోగదారునిపేరు కన్పిస్తుంది. సబ్మిట్ నొక్కగానే ఫిర్యాదు నమోదవుతుంది. దీంతో ఈ ఫిర్యాదు అందిన వెంటనే స్థానిక సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. ఇక ఇతర ప్రాంతాల్లోనూ విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా గెస్ట్ యూజర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఫొటోలు, వీడియోలతో కూడా సమస్యలను ఫిర్యాదు చేయవచ్చు