గతంలో ఎవ్వరూ చేయని విధంగా దేశ చరిత్రలోనే అతిపెద్ద పొలిటికల్ ర్యాలీగా ప్రగతి నివేదన సభ నిలుస్తుందని మంత్రి కేటీఆర్ మీడియాకు తెలిపారు. ఆదివారం జరగనున్న బహిరంగ సభకు 25 లక్షల మంది హాజరుకానున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జంటనగరాలకు దూరంగా, ట్రాఫిక్, పార్కింగ్ సదుపాయాలు గల ప్రాంతాన్ని సభా వేదిక ప్రాంతంగా నిర్ణయించామన్నారు. .. టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. తెలంగాణ పల్లెలు కొంగరకొలాన్ కు దారి పట్టాయి. తమ నాలుగేళ్ల పాలనలో తెలంగాణలో జరిగిన పురోగతిని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణలోని ఇతర రాజకీయ పక్షాలన్నీ సభ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.
ప్రగతి నివేదన సభా స్థలికి 15 రోడ్డను అనుసందానం చేశారు, 30 అంబులెన్స్ సర్వీసులు, 100 మంది డాక్టర్లను అందుబాటులో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా వాహనాల్లో సభకు చేరుకుంటున్న వారికోసం జిల్లాల వారీగా సీటింగ్ సదుపాయం, వాహన పార్కింగ్ సదుపాయం, మంచి నీటి సౌకర్యం, సభా ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పర్యావరణ హితంగా సభను నిర్వహిస్తున్నారు.