రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ 19 వ్యాక్సిన్లను పూడ్చి పెడుతున్నారంటూ వార్తలు రావడంపై మంత్రి జవదేకర్ స్పందించారు. రాజస్థాన్ ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో ఒక చోట 80 శాతం నిండి ఉన్న వ్యాక్సిన్ వయల్స్ చెత్త కుప్పలో పడి ఉన్నాయని తన దృష్టికి వచ్చిందని జవదేకర్ అన్నారు.
రాజస్థాన్‌లో మొదట వ్యాక్సిన్లను చెత్త కుప్పలో పడేశారు. తరువాత భూమిలో పాతిపెట్టారు. ఇప్పుడు వారు వ్యాక్సిన్ల కొరత ఉందని వ్యాక్సిన్లు కావాలని అడుగుతున్నారు. ఇది కాంగ్రెస్ చేపట్టిన టూల్‌కిట్‌లో ఓ భాగమా ? అని జవదేకర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కాగా రాజస్థాన్‌లోని అనేక జిల్లాల్లో కోవిడ్ టీకాలు పెద్ద ఎత్తున వృథా అవుతున్నాయని వార్తలు వచ్చాయి. అయితే ఆ రాష్ట్ర మంతులు ఆ వార్తలను ఖండించారు. టీకాలు వృథా అవుతున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతాసార మాట్లాడుతూ కేంద్రం తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. టీకాలను వృథా చేస్తున్నామని ఆరోపించడం సరికాదన్నారు. నిజానికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే టీకాల వృథా తమ వద్దే తక్కువగా ఉందన్నారు.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ ఇది వరకే టీకాల వృథాపై రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. టీకాలు వృథా కాకుండా చూసుకోవాలని అన్నారు. అయితే రాజస్థాన్‌లో 35 కోవిడ్ టీకా సెంటర్లలో 500 వయల్స్ వృథాగా చెత్త కుప్పల్లో పడి ఉన్నాయని అక్కడి మీడియాలోనూ వార్తలు వచ్చాయి. అందుకనే ఆ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య ఈ విషయంలో మాటల యుద్ధం సాగుతోంది.