ప్రకాశ్‌రాజ్ ఓ సినిమాలో తన భార్య ఫొటోను చూస్తూ గత జ్ఞాపకాల్లోకి వెళ్తారు. కంటతడి పెట్టుకుంటారు. ఇంతవరకూ బాగానే ఉంది మధ్యలో త్రిష ఎందుకొచ్చిందని అనుకుంటున్నారా? టెక్నాలజీ సాయంతో ఓ నెటిజన్.. ప్రకాశ్‌రాజ్ భార్యగా కనిపించిన ఆ నటి ఫొటోను తీసేసి ఆ స్థానంలో త్రిష ఫొటోని ఉంచాడు. ప్రకాశ్‌రాజ్‌బాధపడేది త్రిష కోసమే అనిపించేలా మాయ చేశాడు.
ఆ ఫన్నీ వీడియో నెట్టింట అటూ ఇటూ చక్కర్లు కొట్టి, చివరకు ప్రకాశ్‌రాజ్‌ను చేరింది.ఆయన ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‘‘ఈ ఎడిటింగ్ చేసిందెవరో తెలియదుగాని దీన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. త్రిష ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేశారు. దీనిపై త్రిష స్పందిస్తూ నవ్వుల ఎమోజీ పెట్టారు. దాంతో, ఆ వీడియో వైరల్ అవుతోంది.
Who ever did this .. made my day ❤️❤️ thank you for the love … CHELLAM s I love uuuuu #muthupandi #gilli @trishtrashers pic.twitter.com/K5F74stwfa
— Prakash Raj (@prakashraaj) September 18, 2022
ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘తిరు’ అనే సినిమాలో ప్రకాశ్‌రాజ్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలోని ఓ భావోద్వేగ సన్నివేశాన్నే సదరు నెటిజన్ ఎడిట్ చేసి, ‘ఘిల్లి’ చిత్రంలోని సన్నివేశాలను అతికించాడు. విజయ్ హీరోగా 2004లో వచ్చిన చిత్రమిది. తెలుగులో మహేశ్‌బాబు నటించిన ‘ఒక్కడు’కు రీమేక్. ఇక్కడ భూమిక కథానాయికగా నటించగా అక్కడ త్రిష నటించారు.
నాయికాప్రతినాయకులుగా, తండ్రీ కూతుళ్లుగా.. ఇలా ఎలా కనిపించినా ప్రకాశ్‌రాజ్- త్రిష కాంబినేషన్‌ను ఇటు తెలుగు ప్రేక్షకులు, అటు తమిళ ప్రేక్షకులు ఆదరించారు. వీరిద్దరు కీలక పాత్రలు పోషించిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ ఈ నెల 30న విడుదలకానుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.