నేపాల్ ప్రధానిగా నియమితులైన కేపీ శర్మ ఓలీని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా మోదీ ఓ పోస్ట్ పెట్టారు. రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని విస్తరించడానికి తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. రెండు దేశాల మధ్య స్నేహబంధాలను బలోపేతం చేసేందుకు, ప్రజల పురోగతి, శ్రేయస్సు కోసం పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని మోడీ అన్నారు. నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ నాలుగోసారి నియమితులయ్యారు. నేపాల్-యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్-యూఎంఎల్), నేపాల్ కాంగ్రెస్ (ఎన్సీ)లతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో కొత్త ప్రధానిగా ఓలీని అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఆదివారం నియమించారు.
శుక్రవారం ప్రజా ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ప్రధాని పుష్పకుమార్ దహల్ ప్రచండ ఓడిపోవడంతో ఓలీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఖాట్మండులో ఏర్పడిన కొత్త సంకీర్ణ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని భారత్ నిశితంగా గమనిస్తోంది. ఓలీ తన పదవికాలంలో చైనాతో సత్సంబంధాలు ఏర్పరుచుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు. భారతదేశ భూభాగాలను కలుపుకుని కొత్త నేపాల్ మ్యాప్ విడుదల చేయడంతో రెండు దేశాల మధ్య వివాదానికి దారితీసింది.