ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ సభలో ప్రియాంకగాంధీ మాట్లాడుతూ… కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలనుకున్న మీ కల నెరవేరిందని, కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సామాజిక న్యాయం కొరవడిందన్నారు. తెలంగాణ వస్తే యువత ఆత్మహత్యలు ఆగుతాయని, రైతుల జీవితాలు బాగుపడతాయని భావించారని, కానీ బీఆర్ఎస్ పాలనలో అవేమీ జరగలేదన్నారు.
మీ ఆశలను అడియాసలు చేసిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఆలోచించకుండా తాము తెలంగాణను ఇచ్చామన్నారు. నెహ్రూ నుంచి సోనియా వరకు అందరూ దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించినట్లు చెప్పారు. ఇప్పటికైనా మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వరికి రూ.2500, మొక్కజొన్నకు రూ.2200 మద్దతు ధర ఇస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇందిరమ్మ భరోసా కింద రూ.15వేలు ఇస్తామన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరాలని సోనియాగాంధీ రాష్ట్రం ఇచ్చారన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఎప్పుడూ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించేవారన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే తెలంగాణకు ఎన్నో జాతీయ సంస్థలు ఇచ్చారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఒక రోడ్ మ్యాప్ రూపొందించిందన్నారు. మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రియాంక గాంధీ అన్నారు.