కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మందకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రీతిది హత్య? ఆత్మహత్య? అనేది తేలకుండానే ఆత్మహత్యాయత్నం కేసు ఎలా నమోదు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతిది ఆత్మహత్యాయత్నం అని చెప్పడానికి ఆధారాలు లేవని, అప్పుడే కేసు పక్కదారి ఎలా పట్టిందని ప్రశ్నించారు.
మెడికో ప్రీతి మృతి కేసుపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ప్రీతి ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ప్రీతి మృతి కేసును హత్య కేసుగా మార్చి జ్యుడీషియరీ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకలను అడ్డుకుంటామని మందకృష్ణ హెచ్చరించారు. ప్రీతి ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని తెలిపారు మందకృష్ణ. ప్రియాంక రెడ్డికి జరిగిన న్యాయమే ప్రీతికి జరగాలని డిమాండ్ చేశారు.