ప్రొఫెసర్ సాయిబాబా ఇకలేరు. ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ వర్సిటీ పరిధిలోని రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా సాయిబాబా పనిచేసే సమయంలో మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో 2014లో మహారాష్ట్ర పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
నాటి నుంచి దాదాపు 10ఏళ్ల పాటు ఆయన నాగ్‌పూర్ జైలులో శిక్ష అనుభవించారు. ఈ ఏడాది మార్చిలో బాంబే హైకోర్టు ఆధ్వర్యంలోని నాగ్‌పూర్ బెంచ్ ధర్మాసనం ఆయన్ను విడుదల చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.ఆయన జైలులో ఉన్న సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గతంలో వార్తలొచ్చాయి.ఆయన ఇప్పటికే పారలైజ్ అయ్యి వీల్ చైర్‌కే పరిమితం అయ్యారు. అనారోగ్య సమస్యల కారణంగా కోర్టు బెయిల్ ఇవ్వగా.. జైలు నుంచి విడుదలయ్యాక గుండె సంబంధిత సమస్యతో నిమ్స్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు.