అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు ఇటీవల హిందువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో రామ మందిర నిర్మాణానికి రూట్ క్లియర్ అయ్యింది. అయోధ్యను బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక నగరిగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమవుతోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్య ట్రస్టు ఏర్పాటు చేసి, గుడి నిర్మాణ పనులు మొదలుపెట్టాల్సి ఉంది. కరసేవక్ పురంలో ఆలయ స్తంభాలు, శిల్పాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు రామమందిరంలో ఓ భారీగంటను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ఇది రామమందిరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.. వేర్వేరు లోహాలతో 2 వేల ఒక వంద కిలోల గంటను తయారు చేయిస్తున్నారట. ఇందు కోసం రెండు నెలలుగా కార్మికులు శ్రమిస్తున్నారు. ఈ శ్రామికుల్లో కొందరు ముస్లింలూ ఉన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యాపురం రూపురేఖలే మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక నగరిగా అయోధ్య ను రూపొందించేందుకు ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. తిరుమల తరహాలో ఆధ్యాత్మిక నగరిగా ఆయోధ్యను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. త్వరలోనే అయోధ్య తీర్థ వికాస్ పరిషత్ ఏర్పాటు చేయబోతున్నారు.
వచ్చే శ్రీరామనవమి నాటికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని యూపీ సర్కారు భావిస్తోంది. అయోధ్య రైల్వే స్టేషన్ ను కూడా విస్తరిస్తారు. అంతర్జాతీయ స్థాయి బస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఫైజాబాద్ -అయోధ్య మధ్య 5 కిలోమీటర్ల పొడవైన ఫ్లై ఓవర్.. ఓ ఫైవ్ స్టార్ హోటల్.. 10 రిసార్టులు.. ఇలా ఎన్నో కొత్త కొత్త వార్తలు వస్తున్నాయి.