బోడుప్పల్లో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. నేడు బోడుప్పల్లోని ఆర్ఎన్ఎస్ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి అనంతరం స్థానిక గణేష్ మండపానికి వెళ్లారు. అక్కడే ఉన్న మహిళలు, బీజేపీ నేతలు మంత్రిని అడ్డుకున్నారు. స్థానికంగా ఉన్న వక్స్ బోర్డ్ సమస్యను వెంటనే తీర్చాలంటూ మంత్రిని నిలదీశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి ముందే బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులు మధ్య తోపులాట జరిగింది, బీజేపీ నాయకులకు మద్దతుగా మహిళలు నిలిచారు. మంత్రి మాట్లాడుతూ వక్స్ బోర్డు సమస్యను తీర్చేది తమ ప్రభుత్వమే, మేమే తీరుస్తామంటూ మహిళలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
అంతే కాక, మంత్రి మల్లారెడ్డి డబ్బులు పంచుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మంత్రి మల్లారెడ్డిని కొందరు చిన్నారులు చుట్టుముట్టారు. వినాయక చవితి చందా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ పిల్లల మాటలు విన్న మంత్రి వెంటనే జేబులో ఉన్న 500 నోట్లు తీసి తనను చుట్టుముట్టిన పిల్లలందరికి తలో నోటు పంచేశారు. అయితే మంత్రి ఓ కండీషన్ పెట్టారు. తానిచ్చిన డబ్బులు దేవుడికే వాడాలని, సొంతగా వాడుకోవద్దని మల్లారెడ్డి సూచించారు. సరే సరే అంటూ ఆనందపడిన పిల్లలంతా జై మల్లన్న అంటూ జై జై మల్లన్న అంటూ నినాదాలు చేశారు. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏం చేసినా మంత్రి మల్లారెడ్డి తనదైన స్టయిల్ చూపుతారు. మల్లారెడ్డి మాట్లాడే మాట తీరు, ఆయన ప్రవర్తన, నడవడిక డిఫరెంట్‌గా ఉంటూ ఆకట్టుకుంటాయి.