ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని మెట్రో నగరాలు, ఓ మోస్తరు పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. అయితే లగ్జెమ్‌బర్గ్ ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇకపై అక్కడ ప్రజా రవాణాను ఉచితం చేసింది. దీని వల్ల ఇక అక్కడి ప్రజలు ప్రభుత్వ రవాణా సదుపాయాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
లగ్జెమ్‌బర్గ్ దేశంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకీ తీవ్రతరమవుతోంది. దీంతో ఆ దేశ ప్రభుత్వం అక్కడి ప్రజా రవాణా సదుపాయాన్ని ఉచితం చేసింది. ఈ క్రమంలో అక్కడి ప్రజలు బస్సు, రైలు లేదా విమానం ఏదైనా సరే.. ప్రభుత్వానికి చెందిన రవాణా సదుపాయం అయితే దాన్ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ సగటు పౌరుడికి నెలవారీ రవాణా ఖర్చులకు 100 యూరోలు (దాదాపుగా రూ.7900) అవుతున్నాయి. ఇకపై ఆ మొత్తం అక్కడి ప్రజలకు ఆదా కానుంది. దీని వల్ల ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుందని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది.
లగ్జెమ్‌బర్గ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచంలో ప్రజా రవాణాను ఉచితంగా అందిస్తున్న మొదటి దేశంగా ఆ దేశం రికార్డులకెక్కింది. కాగా అంతకు ముందు అక్కడి జనాభాలో 32 శాతం మంది బస్సుల్లో, 19 శాతం మంది రైళ్లలో ప్రయాణిస్తుండగా, ఇప్పుడా శాతం మరింత పెరగనుంది. అలాగే ట్రాఫిక్ సమస్య నుంచి బయట పడవచ్చని ఆ దేశ ప్రభుత్వం అభిప్రాయ పడుతోంది. అయితే రైళ్లు, విమానాల్లో ఎకానమీ క్లాస్‌లో మాత్రమే ప్రజలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అదే ఫస్ట్ క్లాస్ అయితే కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా.. రవాణా సదుపాయాన్ని ఉచితంగా అందివ్వడం అంటే మాటలు కాదు.. అందుకు లగ్జెమ్‌బర్గ్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే..!