నేనెందుకు పుట్టాను? ఎందుకు ఈ భూమ్మీద ఉన్నాను? ఏదో అర్థం ఉండబట్టే కదా ఆ దేవుడు నన్ను పుట్టించాడు? మరి ఆ అర్థం ఏమిటి? అదే పర్పస్ ఏమిటి? నా జీవితానికి అర్థం, పరమార్థం ఏమిటి? దేవుడు నా నుండి ఏం కోరుకుంటున్నాడు? అని చాలామంది మధనపడుతుంటారు? నిజానికి జీవితానికి అర్థం లేదు. జీవితం అర్థం లేనిది. ప్రేమ అర్థం లేనిది. ఇక్కడ జరిగే ప్రతీదానికి అర్థం లేదు. ఎందులోకి తొంగిచూసినా సమాధానం దొరకదు. ఎంత సేపు చూసినా ఏమీ దొరకదు.
నేను కారణ జన్ముడిని అనుకున్నవాడే ఇక్కడ ఎక్కువ పాపాలు చేస్తాడు. నేనీ ఇసుకరేణువుని అనుకున్నవాడే ఏ తప్పూ చేయకుండా సంతోషంగా ఉంటాడు. భూమ్మీద ఉన్న చెట్టుకి పర్పస్ ఉంటుందా? దాని మీద వాలిన పిట్టకి పర్పస్ ఉంటుందా? వాటిలాగే నువ్వు కూడా ఏ పర్పస్ లేకుండా పుట్టావు. నీ గుండె కొట్టుకుంటుంది. అటూ ఇటూ తిరుగు, కొండెక్కు, సముద్రంలోకి దూకు, ఏదనిపిస్తే అది చెయ్. అంతేకానీ ఏదో పర్పస్ కోసం నేను పుట్టానను నువ్వు అనుకుంటే చాలా తప్పులు చేస్తావు.
మిగతా జంతువులన్నీ వేరు నేను వేరు అనుకోకు. ఈ భూమ్మీద మానవజాతి మొత్తం అంతరించిపోయిన భూమికి నష్టం లేనపుడు నువ్వేంటి గొప్ప. అందుకే మానవజాతికి అర్థం లేదు. మానవ జీవితాలకి పర్పస్ లేదు. గుండె ఆగేలోపు ఎన్ని సార్లు నవ్వితే అంత మంచిది. దానివల్ల మన శరీరంలో హార్మోన్లు విడుదల అవుతాయి. ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ మొదలగునవి ఆరోగ్యానికి మంచివి. ముఖం మీద చిరునవ్వు వస్తుంది. కళ్ళలో మెరుపు వస్తుంది. పక్కనున్న వాళ్ళకి అందంగా కనబడతారు.
ఇంతే, అలా బ్రతగ్గలిగితే చాలు. ఇంతకుమించి ఎక్కువ ఆలోచించడం అనవసరం. పర్పస్ ఆఫ్ లైఫ్, సోల్ సెర్చింగ్ వాటి గురించి వెతుకుతుంటే అర్జెంటుగా ఆపేయండి. నువ్వో పర్పస్ కోసం పుట్టావనుకుంతే నువ్వీ బానిస కిందే లెక్క. ఆల్రెడీ నువ్వో టార్గెట్ పెట్టుకున్నావ్? ఇక దాని కోసమే పనిచేస్తావు. స్వేఛ్ఛ ఉండదు. అందుకే స్వేఛ్ఛగా ఉండాలంటే ఇలాంటివి మానేయండి. సింఫుల్ గా చెప్పాలంటే నవ్వుతూ కనిపించడమే జీవితానికి అసలైన అర్థం అని పూరీ జగన్నాథ్ తన పాడ్ కాస్ట్ లో వివరించారు.