ఓ సాధారణ వ్యక్తి కనిపించకపోతేనే నానా హైరానా చేస్తాం. అలాంటి ఓ ప్రజాప్రతినిధి వారం రోజులుగా కనిపించట్లేదు. ఆయన సాధారణ ప్రతినిధి కాదండోయ్.. ఏకంగా జిల్లా జడ్పీ చైర్మన్. గతంలో ఎమ్మెల్యేగా కూడా చేశారు. అధికార టీఆర్ ఎస్ కీలక నేత. ఇంతకీ ఆయనెవరా అనుకుంటున్నారా ఆయనేనండి పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధు. ఏంటి ఆయన కనిపించట్లేదా అని ఆశ్చర్యపోకండి ఇది నిజమే.
వారం క్రితం హైదరాబాద్‌లో పనుందని చెప్పి ఆయన భార్య కారులో వెళ్లిన వ్యక్తి ఇంకా తిరిగి రాలేదు. కనీసం ఎక్కడికి వెళ్లాడో కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎందుకంటే ఆయన ఈటల రాజేందర్ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫోన్ కూడా స్విచ్ఛాప్ వస్తోంది. పోలీసులు మాత్రం దీనిపై నోరు మెదపట్లేదు.
ఇక వామన్‌రావు న్యాయవాద దంపతుల హత్యలో ఈయనకు ఓ ఉన్నతాధికారి ఫోన్ చేయగా.. ఆయన హైదరాబాద్ వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఎవరూ నోరుమెదపట్లేదు. ప్రభుత్వ వాహనాన్ని వదిలేసి తన భార్య కారులో వెళ్లడం గమనార్హం. అయితే ఆయన ఫోన్ చివరగా మహారాష్ట్రలో సిగ్నల్ చూపించినట్టు పోలీసులు తెలుపుతున్నారు. ఇక మరోవైపు పుట్టమధు భార్య శైలజ తన కొడుకు, కోడలితో కలిసి హైదరాబాద్ వెళ్లి మంత్రులను కలుస్తున్నారు. ఈ పరిణామాలన్నీ ఇప్పుడు పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. అయితే దీనిపై పోలీసులే నిగ్గు తేల్చాల్సి ఉంది.