Fact Check: నిమ్మ‌ర‌సం ముక్కులో వేసుకుంటే కోవిడ్ రాకుండా అడ్డుకోవ‌చ్చా ? నిజ‌మెంత ?

-

ఫలానాది తింటే కరోనా తగ్గుతుందని.. అలా చేస్తే కోవిడ్‌ రాకుండా అడ్డుకోవచ్చు.. ఇది పాటిస్తే కరోనా రాకుండా చూసుకోవచ్చు.. అని సోషల్‌ మీడియాలో రోజూ మనకు పుట్టలు పుట్టలుగా మెసేజ్‌లు కనిపిస్తుంటాయి. అయితే వాటిల్లో చాలా వరకు మెసేజ్‌లు నకిలీవే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. సోషల్‌ మీడియాలో వచ్చిన అలాంటి ఓ మెసేజ్‌ను చదివిన ఓ వ్యక్తి అందులో ఇచ్చిన సూచనను పాటించాడు. దీంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

ప్రముఖ పారిశ్రామిక వేత్త, వీఆర్‌ఎల్‌ గ్రూప్‌ చైర్మన్‌ విజయ్‌ శంకేశ్వర్‌ ఇటీవలే లెమన్‌ థెరపీ పేరిట ఓ విషయం చెప్పారు. తాను, తన కుటుంబ సభ్యులు, బంధువులు నిమ్మరసం రెండు చుక్కలను ముక్కులో వేసుకుంటున్నారని, అది కోవిడ్ రాకుండా అడ్డుకుంటుందని చెప్పారు. అంతేకాదు, తన దగ్గర పనిచేసే సీనియర్‌ అధికారి ఒకరు కోవిడ్‌ బారిన పడ్డారని, ఆయనకు ఆక్సిజన్‌ లెవల్స్‌ బాగా పడిపోయాయని, దీంతో లెమన్‌ థెరపీ గురించి చెప్పానని, ఆయన ముక్కులో రెండు నిమ్మరసం చుక్కలు వేసుకున్నారని, దీంతో ఆయన ఆక్సిజన్‌ లెవల్స్‌ 88 నుంచి 96 శాతానికి పెరిగాయని తెలిపారు.

అయితే ఆయన సోషల్‌ మీడియాలో పెట్టిన పై వివరాలకు చెందిన మెసేజ్‌ వైరల్‌ అయింది. దీంతో ఆ వివరాలు నిజమే అని నమ్మిన రాయచూర్‌కు చెందిన బసవరాజ్‌ అనే వ్యక్తి కోవిడ్‌ రాకుండా ఉంటుందని చెప్పి ముక్కులో రెండు నిమ్మరసం చుక్కలు వేసుకున్నాడు. దీంతో వెంటనే అతనికి వాంతులు అయ్యాయి. క్షణాల్లోనే అతని పరిస్థితి విషమించింది. అతన్ని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న మీడియా సంస్థలు సదరు విషయాన్ని వెరిఫై చేశాయి.

విజయ్‌ శంకేశ్వర్‌ చెప్పిన విషయం వట్టిదే అని, లెమన్‌ థెరపీ అంతా అబద్దమని, నిమ్మరసం చుక్కలను ముక్కులో వేసుకుంటే కోవిడ్‌ రాదని, ఆక్సిజన్‌ లెవల్స్ పెరుగుతాయని చెప్పిందంతా అబద్దమని తేల్చారు. నిమ్మరసంలో విటమిన్‌ సి ఉంటుంది. దాన్ని తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కోవిడ్‌తో పోరాడేందుకు ఇది సహాయ పడుతుంది. అంతే కానీ నిమ్మరసాన్ని ముక్కులో వేసుకోవడం వల్ల కోవిడ్‌ రాదు అని అనుకోవద్దు. ఇలా చేయడం వల్ల ఆక్సిజన్‌ లెవల్స్‌ కూడా పెరగవు. కనుక సోషల్‌ మీడియాలో వచ్చే ఇలాంటి మెసేజ్‌లను చదివి వాటిల్లో ఇచ్చింది ఫాలో అయ్యే ముందు ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆ వివరాలను వెరిఫై చేసుకోవడం మంచిది. లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version