రబీ పంటలకు మద్దతు ధరలు పెంచిన కేంద్రం..

లోక్ సభలో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రతిపక్షాలతో సహా రైతులు రోడ్ల మీదకి వచ్చి మరీ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు ఆ వ్యవసాయ బిల్లులకి రాజ్యసభ నుండి కూడా ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుపై కోపంగా ఉన్నారు. వారి కోపాన్ని చల్లార్చడానికా అన్నట్టు కేంద్ర ప్రభుత్వం రబీ పంటలకి కనీస మద్దతు ధరని మరింతగా పెంచింది. ఈ పెంపు 50నుండి 300 వరకూ ఉంటుందని తెలిపింది. ఈ మేరకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడి చేసారు.

ఐతే ఏయే పంటపై ఎంత పెరిగిందన్నది చూస్తే, క్వింటాల్ గోధుమకి ప్రస్తుతం ఉన్న ధరకి 50రూపాయలు ఎక్కువ పెంచారు. ఇంకా శనగలకి 250 రూపాయలు, మసూర్ దాల్ (ఎర్రపప్పు) పై 300 రూపాయలు, ఆవాలకి 225రూపాయలు పెంచారు. మరి ఇకనైనా రైతులు శాంతిస్తారేమో చూడాలి. వ్యవసాయ బిల్లుల వల్ల పెద్ద పెద్ద సంస్థలకి డైరెక్టుగా పంటని అమ్ముకోవచ్చని, మధ్యవర్తులు ఉండరని ప్రభుత్వం అంటుంటే, దానివల్ల రైతులకి ఇబ్బంది కలుగుతుందని బేరసారాలు తగ్గిపోతాయని రైతులు అంటున్నారు.