ఓఆర్ఆర్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య రేడియల్ రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఆర్అండ్ బీ అధికారులతో రివ్యూ అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించడంపై ప్రధానంగా దృష్టి పెట్టామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ కు యుటిలిటీ చార్జీలు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయని అన్నారు. తాను కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి యుటిలిటీ చార్జీలు చెల్లిస్తామని చెప్పానని, దాంతో పనులు ప్రారంభమయ్యాయని కోమటిరెడ్డి తెలిపారు. ఏ రోడ్డు చెడిపోయినా కేవలం కాంట్రాక్టరే బాధ్యుడు కాదని, సంబంధిత అధికారి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
అంబర్ పేట ఫ్లై ఓవర్ పనులు నెల రోజుల్లో ప్రారంభిస్తాము. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ తర్వాత మరో 4.4 కిలోమీటర్ల 6 లేన్ల రహదారి విస్తరణ 82 శాతం పూర్తయ్యిందని, అటవీ అనుమతుల 1.1 కి.మీ వల్ల ఆగిందని, అటవీ అనుమతులు కాగానే పనులను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.