ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించిన వైకాపాలో ఒక్కసారిగా పెద్ద బండరాయి వేసే ప్రయత్నం చేశారు రఘురామకృష్ణం రాజు అని కామెంట్లు పడుతున్నాయి. దానికి.. గత కొన్ని రోజులుగా జగన్ పై తనకున్న ప్రేమను.. సమాజం, వైకాపా ఎమ్మెల్యేలు, ఆఖరికి జగన్ కూడా అర్ధం చేసుకోవడం లేదంటూ చెలరేగిపోతున్న.. ఆయన ప్రవర్తనే కారణం అని కూడా చెబుతున్నారు. అధినేతతో ఇబ్బంది ఉంటే దాన్ని చెప్పుకోవడానికి, వెళ్లబుచ్చుకోవడానికీ సవాలక్ష మార్గాలు ఉన్నా కూడా.. రఘురామక్రష్ణం రాజు తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు.. ఫలితంగా వైకాపా కార్యకర్తలకు పరోక్షంగా దూరమయ్యారు అనే చెప్పాలి! దానికి రెండు కారణాలు ఉన్నాయి! అందులో ఒకటి కార్యకర్తల ఆవేశంతో జరిగిన పొరపాటైతే.. మరొకటి రఘురామక్రిష్ణం రాజు తాజాగా చేసిన పని!!
వైకాపా అధినేతపై మాటల్లో ప్రేమా, చేతల్లో కోపం చూపిస్తున్నారని నమ్మిన అనంతరం… నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వైకాపా ఎమ్మెల్యేలు.. రఘురామకృష్ణం రాజు ప్రవర్తనను ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రఘురామకృష్ణం రాజు ప్రవర్తన, మాటతీరు ఏమాత్రం నచ్చని కొందరు కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆయన ఫ్లెక్సీలను టమాటాలు, కోడిగుడ్లతో కొట్టారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా.. మరి ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో… వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
దిష్టి బొమ్మలు దహనం చేసి.. తనను కించపరుస్తూ మాట్లాడారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆయన… నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరారు. దీంతో కార్యకర్తలు ఆన్ లైన్ వేదికగా కామెంట్లు మొదలెట్టేశారు! రెండు వారాలముందు పార్టీలో చేరి బీ ఫారం తెచ్చుకున్నా కూడా నెత్తినపెట్టుకుని ఎంపీని చేశామని.. ఆ కృతజ్ఞత లేకుండా తమపై కేసులు పెట్టారని కామెంట్లు చేస్తున్నారు కార్యకర్తలు!
దీంతో.. అటు అధినేతనూ పరోక్షంగా కాదని, ఇటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలను కాదనుకుని.. ఆఖరికి పార్టీకి వెన్నెముఖ లాంటి కార్యకర్తలపై కూడా కేసులు పెట్టి.. ఏమి సాదిద్దామని ఆయన అనుకుంటున్నారని చర్చలు మొదలయ్యాయి. రాజకీయాల్లో ఉండాలనుకునేవారు చేసే పద్దతి ఇది కాదేమో అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. డబ్బుతో సీట్లు వస్తాయి.. కొన్నిసార్లు ఓట్లు వస్తాయి అనుకోవచ్చు కానీ… అభిమానం, కార్యకర్తల బలం మాత్రం నమ్మకతో వస్తుందని ఇంకొందరు సూచిస్తున్నారు. ఏది ఏమైనా… ఇప్పుడు “రఘురామ కృష్ణంరాజు దారెటు” అంటూ కామెంట్లు చేస్తున్నారు!!