నాకు జగన్ కు మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదో మీకు తెలియదు. మామధ్య విభేదాలకు కారణం మీకు తెలియదని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామరాజు పేర్కొన్నారు. జగన్ రమ్మంటేనే నేను ఈ పార్టీలోకి వచ్చానన్న ఆయన నా రాజీనామా పై బొత్స లాంటి మంత్రులు ఎలాంటి నేలబారు ప్రకటనలు చేయకండని కోరారు. అమరావతి పై రిఫరెండం గా ఎన్నిక జరిగితే నేను కనీసం లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నేను రాజీనామా చేసి తిరిగి ఎన్నికైతే అమరావతి మాత్రమే రాజధానిగా వుంటుందని సీఎం ఒప్పుకుంటేనే నేను రాజీనామా చేస్తా అన్నానని ఇప్పటికీ అదే మాట మీద ఉంటానని అన్నారు. ఆలయాల పరిరక్షణ, అర్చకుల పరిరక్షణ, “హిందూ ధర్మ పరిరక్షణ” కోసం “సనాతన స్వదేశీ సేన” అనే సంస్థను స్థాపించామని ఆయన అన్నారు. అంతర్వేది ఘటన ప్రతిపక్షాల కుట్రేనని రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆరోపిస్తుంటే, ఎందుకు వారిపై కేసు పెట్టలేదని ప్రశ్నించారు ఆయన. పోలీసులు హిందూ దేవాలయాల పై జరిగే దాడుల పై ఎందుకు వేగంగా స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.