ఖర్మ అంటే.. ఎలా ఉంటుందో.. జనసేనాని పవన్‌ని అడిగే చెబుతారని అంటున్నారు పరిశీలకులు. ఆయన రాజకీయాల్లోకి ఎలాంటి ముహూర్తంలో ఏ సమయంలో అడుగు పెట్టారో తెలియదు కానీ.. ఆయనపై ఓట్లు కూడా పడని విధంగా.. అనేక అపవాదులు.. అపనిందలు మాత్రం పడుతున్నాయి. నిజానికి ఈ రేంజ్‌లో ఆయనపై ఓట్లు పడి ఉంటే.. అసెంబ్లీలో అడుగు పెట్టి ఉండేవారు. కానీ, ఆయనపై అపవాదులు మాత్రం తెరమీదికి వస్తున్నాయి. ఆయన 2014లో టీడీపీకి మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినప్పుడు .. నిజానికి పవన్ కు చెప్పలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.
కానీ, అమరావతి ప్రాంత రైతులకు అన్యాయం జరిగినప్పుడు.. పొలో మంటూ.. అందరూ హైదరాబాద్‌లోని పవన్ ఇంటికి క్యూకట్టారు. తమకు బాబు సర్కారు అన్యాయం చేస్తోందన్నారు. అరె! నాకు కనీసం మాట కూడా చెప్పలేదన్న పవన్.. నేరుగా సీఎంగా ఉన్న చంద్రబాబును కలిసి పరిస్థితిని వివరించి.. ఇస్తామన్న వారి నుంచే పొలాలను తీసుకోవాలని చెప్పారు. ఫలితంగా సీడ్ యాక్సిస్ రోడ్ కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరం రైతులు పొలాలు ఇవ్వనందున నిలిచిపోయింది. అయినప్పటికీ.. పవన్ వల్లే రోడ్డు నిలిచిపోయిందని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు.
అదే సమయంలో చంద్రబాబు సైతం మిత్రపక్షంగా ఉన్న తమకు ఒక్కమాటైనా చెప్పలేదని అప్పట్లోనే జనసేన నేతలు ఆరోపించారు. ఇక, ఇప్పుడు ఇదే జనసేన.. బీజేపీతో జట్టుకట్టింది. ఈ క్రమంలో రాజధాని తరలిస్తామన్న జగన్ విషయం.. మరోసారి పవన్ మెడకు చుట్టుకుంది. రాజధాని తరలింపును తీవ్రంగా అడ్డుకుంటున్న రైతులకు మద్దతుగా తానుకూడా ఉద్యమిస్తామని, లాంగ్ మార్చ్ చేసైనా.. ఈ తరలింపును అడ్డుకుంటానని పవన్ ప్రకటించారు.
ఇక, ఈ క్రమంలోనే తాను బీజేపీతో జట్టుకట్టానన్నారు. ఇక, ఇప్పుడు ఇవే విషయాలపై ఇక్కడి రైతులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. మాకు మద్దతన్నారు.. లాంగ్ మార్చ్ అన్నారు.. కేంద్రంతో కలిసి జగన్‌కు ముకుతాడు వేస్తానన్నావు.. మరి మౌనం ఎందుకు? అని పవన్‌ను నిలదీస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు జరగుతున్న పరిణామంలోనూ పవన్ నిమిత్త మాత్రుడే.. తనకు తెలిసి.. రాజధాని ఎంపిక జరగలేదు.. తనకు చెప్పి.. జగన్ రాజధానిని తరలించడం లేదు. పైగా తనకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ.. కూడా తనతో సంప్రదించి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం లేదు..
అయినప్పటికీ.. ఇప్పుడు తాను సెంటరాఫ్‌ది టాపిక్ అయ్యారనేది పవన్ అనుచరుల, అభిమానుల ఆవేదన. ఇంత చేస్తే.. ఆయనకు(ఆయన నిలబెట్టిన అభ్యర్థులకు) రాజధాని ప్రాంతంలో వచ్చిన ఓట్లు.. నామమాత్రం.. మరి రాజకీయాల్లో ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా?! అందుకే.. ఏం ఖర్మరా బాబూ.. ఎటొచ్చీ.. పవనే చిక్కుకుపోయాడా! అనే కామెంట్లు జనసేనలో జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.