అంటార్కిటికాలో పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌లు.. ప్ర‌పంచానికి ముప్పు త‌ప్ప‌దా..?

మనిషి చేస్తున్న అనేక త‌ప్పిదాల వ‌ల్ల ఇప్ప‌టికే ప‌ర్యావ‌ర‌ణానికి పెద్ద ఎత్తున ముప్పు క‌లుగుతోంది. దీంతో ఏటా భూతాపం పెరిగిపోతోంది. దాని ప‌ర్య‌వ‌సానాల‌ను మ‌నం ఇప్ప‌టికే అనుభ‌విస్తున్నాం. అయితే ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురి చేసే మ‌రొక అంశం తెర పైకి వ‌చ్చింది. అదేమిటంటే.. అంటార్కిటికాలో ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతున్నాయి. ఇది చాలా ఆందోళ‌న చెందాల్సిన అంశ‌మ‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

raising temperatures in Antarctica worries so much

అంటార్కిటికాలో గ‌త 38 ఏళ్ల త‌రువాత ఇప్పుడే తొలిసారిగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త పెరిగింది. 1982లో అక్క‌డి సైనీ ద్వీపంలో 19.8 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదు కాగా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన అక్క‌డికి స‌మీపంలో ఉన్న సెయ్‌మోర్ ద్వీపంలో 20.75 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. చాలా ఏళ్ల త‌రువాత ఇప్పుడు రికార్డు స్థాయిలో అక్క‌డ ఉష్ణోగ్ర‌త న‌మోదు కావ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఎందుకంటే అంటార్కిటికాతోపాటు చుట్టు ప‌క్క‌ల ఉన్న మంచు ప్రాంతంలోని మంచు అంతా క‌రిగితే అప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా స‌ముద్ర మ‌ట్టాలు పెరుగుతాయి. దీంతో తీర‌ప్రాంతాల్లో ఉండే అన్ని న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాలు నీట మునుగుతాయి. నిజంగా ఇది చాలా ఆలోచించాల్సిన విష‌య‌మే అని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు.

అయితే ఈ విష‌యాన్ని వ‌ర‌ల్డ్ మెట‌ర‌లాజిక‌ల్ ఆర్గ‌నైజేష‌న్ ధ్రువీక‌రించాల్సి ఉంది. అదే జ‌రిగితే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఈ విష‌యాన్ని కాస్త సీరియ‌స్‌గా తీసుకోవాల్సిందే. అంటార్కిటికాలోనే కాదు, భూమిపై ఇత‌ర ప్రాంతాల్లో ఉన్న మంచు క‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలి. లేదంటే భ‌విష్య‌త్తులో అనేక ఉప‌ద్ర‌వాలు సంభ‌వించేందుకు అవ‌కాశం ఉంటుంది.