బీజేపీలో కీలక నేతగా ఉన్న రాంమాధవ్ అనూహ్యంగా పూర్వశ్రమంలోకి ఎందుకెళ్లారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన రాం మాధవ్ కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారన్న ప్రచారం నేపథ్యంలో అనూహ్యంగా ఆర్ఎస్ఎస్ లో మళ్లీ కీలక బాధ్యతలు ఎందుకు తీసుకున్నారు. రాం మాధవ్ ని ఆర్ఎస్ఎస్ వెనక్కి పిలిచిందా లేక మరేదైన వ్యూహం ఉందా అన్నదానిపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.
బెంగళూరు వేదికగా జరిగిన ఆర్ఎస్ఎస్ స్థాగత మార్పుల్లో అందరి దృష్టీ సంఘ్ ప్రధాన కార్యదర్శిపైనే నెలకొంది. భయ్యాజీ జోషీ స్థానంలో దత్తాత్రేయ హోసబాలే బాధ్యతలు చేపట్టారు. కానీ ఈ మార్పులు చేర్పుల్లో ఉన్న మరో ముఖ్యమైన మరో పేరు రాంమాధవ్. ఆయన మళ్లీ ఆర్ఎస్ఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. బీజేపీలో కీరోల్ పోషిస్తున్న రాం మాధవ్ మళ్లీ సంఘ్ వైపు మొగ్గుచూపడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
రాంమాధవ్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. సంఘ్‌లో సుదీర్ఘకాలంగా ఫుల్‌టైమ్ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలు బీజేపీకి కూడా అవసరం అనుకున్న సంఘ్ పెద్దలు రాంమాధవ్‌కు బీజేపీలో కీలక బాధ్యతలు అప్పగించారు . అప్పటికే రాంమాధవ్ అంటే ఒక గుర్తింపు ఉండటంతో అది ఆయనకు కలిసి వచ్చింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా.. ప్రధాన కార్యదర్శిగా పార్టీ అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశారు.
జమ్మూ కశ్మీర్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. బీజేపీ పొడ గిట్టని పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆయనదే కీ రోల్. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల పై దృష్టి సారించారు రాం మాధవ్. ఆయా రాష్ట్రాలో బీజేపీ పుంజుకోవడానికి, బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యేలా చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఇక ప్రధాని మోడీ విదేశీపర్యటనల్లో సైతం రాం మాధవ్ దే కీలకపాత్ర. అలాంటిది ఉన్నట్టుండి బీజేపీలో రాంమాధవ్ సైలెంట్ అయ్యారు.
జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడైన తర్వాత ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో ఆయనకు చోటు దక్కలేదు. కానీ రాజ్యసభకు పంపించి ప్రధాని మోడీ తన క్యాబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా సంఘ్ వైపు ఆయన మొగ్గుచూపడంతో ఏం జరిగిందా అన్నది ఆర్ఎస్ఎస్ ఇటు బీజేపీ శ్రేణుల్లో లో హాట్ టాపిక్ గా మారింది. రాంమాధవ్‌కుముందు బీజేపీ సంఘటనా కార్యదర్శిగా ఉన్న రాంలాల్ విషయంలో అదే జరిగింది. ఇది చాలా కీలకమైన పోస్ట్. ఆర్ఎస్ఎస్ బీజేపీలకు మధ్య అనుసంధానం చేసే బాధ్యత కూడా వీరిపైనే ఉంటుంది.
ఇది సాధరణ నిర్ణయమని బీజేపీ నేతలు పైకి చెబుతున్నా రాజకీయాల్లో అత్యంత క్రీయశీలకపాత్ర పోషించి మళ్లీ సంఘ్ లోకి వెళ్లడం వెనుక మాత్రం కమలనాథుల వ్యూహం వేరే ఉందన్న చర్చ నడుస్తుంది.