రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్రం’. మూడు భాగాలుగా రూపొందుతోంది. దీన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. కళ్లు చెదిరే గ్రాఫిక్స్ హంగులతో ముస్తాబైన ఈ సినిమాకు.. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, నాగార్జున వంటి స్టార్ మెరుపులకు తోడవడం.. దర్శక ధీరుడు రాజమౌళి స్వయంగా సమర్పిస్తుండటంతో సినీప్రియుల కళ్లన్నీ ఈ చిత్రంపై పడ్డాయి. దీనికి తగ్గట్లుగానే పాటలు.. ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఇంతటి భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్ర తొలి భాగం ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పించింది?
కథ: సకల అస్త్రాలకు అధిపతి బ్రహాస్త్రం. మూడు ముక్కలైన ఆ శక్తిమంతమైన అస్త్రాన్ని బ్రహ్మాన్ష్ గ్రూప్ కాపాడుతుంటుంది. బ్రహ్మాస్త్రంలోని ఒక భాగం మోహన్ భార్గవ్ (షారుఖ్ ఖాన్) అనే సైంటిస్ట్ దగ్గర ఉండగా.. రెండో భాగం అనీష్ (నాగార్జున) అనే ఆర్టిస్ట్ దగ్గర ఉంటుంది. ఇక మూడో భాగం ఎక్కడుందన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఈ మూడు భాగాలను వెతికి పట్టుకొని.. వాటిని ఒక్కటి చేసి.. ఆ బ్రహ్మాస్త్రం శక్తితో ప్రపంచాన్ని శాసించాలని ప్రయత్నిస్తుంటుంది దేవ్ బృందం.
ఈ అసుర గణాన్ని ముందుకు నడిపించే సారథి జునూన్ (మౌనీరాయ్). బ్రహ్మాస్త్రాన్ని దక్కించుకునేందుకు ఈ బృందం చేసే ప్రయత్నాలకు డీజే శివ (రణ్‌బీర్ కపూర్) అడ్డుతగులుతాడు. మరి ఇతనెవరు? బ్రహ్మాస్త్రానికి అతనికీ ఉన్న సంబంధం ఏంటి? అతనిలో దాగున్న అగ్ని అస్త్రం వెనకున్న కథేంటి? బ్రహ్మాస్త్రంలోని మూడో భాగం ఎవరి దగ్గర ఉంది? దేవ్ బృందం బారి నుంచి బ్రహ్మాస్త్రాన్ని కాపాడేందుకు శివ ఎలాంటి సాహసాలు చేశాడు? ఈ కథలో గురు (అమితాబ్ బచ్చన్) పాత్రేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే: ఒక సూపర్ పవర్.. దానికి రక్షగా నిలిచే పలువురు సూపర్ హీరోలు.. ఆ సూపర్ పవర్‌ను దక్కించుకొని ప్రపంచాన్ని శాసించాలనుకునే ఓ దుష్టశక్తి బృందం.. ఈ తరహా నేపథ్యంతో ఇప్పటికే హాలీవుడ్‌లో బోలెడన్ని కథలొచ్చాయి. ప్రపంచ సినీ ప్రియుల్ని అలరించిన అవెంజర్స్ ఈ తరహా ప్రయత్నమే. నిజానికి ఈ కథలు చూసినప్పుడు వీటిపై భారతీయ ఇతిహాసాల ప్రభావమే ఉందేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇలాంటి సూపర్ పవర్స్‌ని మన ఇతిహాసాల్లో అస్త్రాల రూపంలో చూపించారు.
ఇలాంటి అస్త్రాల్లో శక్తిమంతమైనది బ్రహ్మాస్త్రం. దీని ఆధారంగానే దర్శకుడు అయాన్ ముఖర్జీ చక్కటి లైన్ రాసుకున్నాడు. ఓ శక్తిమంతమైన అస్త్రం.. దాన్ని రక్షించే కొన్ని అద్భుత శక్తులు.. మరోవైపు ఆ అస్త్రాన్ని దక్కించుకుని ప్రపంచాన్ని శాసించాలనుకునే ఓ చీకటి శక్తి. ఈ రెండింటికీ మధ్య జరిగే యుద్ధమే చిత్ర కథ. లైన్‌గా కథ బాగున్నా.. దీన్ని అంతే చక్కగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు తడబడ్డాడు.
కథలో చక్కటి సంఘర్షణ చూపించడానికి అవసరమైన బలమైన శక్తులున్నా.. వాటిని సరైన రీతిలో కనెక్ట్ అయ్యేలా చెప్పలేకపోయారు అయాన్ ముఖర్జీ. గ్రాఫిక్స్ హంగులు కనులవిందుగా ఉన్నా.. ప్రేక్షకులు కథతో కనెక్ట్ కాలేకపోవడంతో తెరపై ఏదో గ్రాఫిక్స్ షో చూస్తున్నట్లుగా తోస్తుంది. బ్రహ్మాస్త్రం, దాని శక్తి సామర్థ్యాలను తెలియజేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో కథ మొదలైన విధానం ఆసక్తి రేకెత్తిస్తుంది. వారుణాస్త్రంగా షారుఖ్ పాత్రను పరిచయం చేసిన విధానం సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఆయనకు జునూన్ బృందానికి మధ్య జరిగే పోరాట ఘట్టం ఉత్సుకత రేకెత్తిస్తుంది. ఆ వెంటనే శివ పాత్రను పరిచయం చేయడం.. ఈషాతో అతని ప్రేమాయణాన్ని చూపిస్తూ నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఈ ఎపిసోడ్ కాస్త సహనానికి పరీక్షలా ఉన్నా.. అక్కడక్కడా మెప్పిస్తుంది. శివలో శక్తులు అతన్ని బ్రహ్మాస్త్రం కోసం రంగంలోకి దిగేలా ప్రేరేపించడం.. ఈ క్రమంలో దేవ్ బృందం నుంచి అనీష్ (నాగార్జున)ను కాపాడేందుకు వారణాసి వెళ్లడంతో కథలో వేగం పెరుగుతుంది. నంది అస్త్రంగా నాగార్జున పాత్రను పరిచయం చేసిన విధానం.. ఆయనకి జునూన్ గ్యాంగ్‌కు మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. విరామానికి ముందు శివలోని అగ్ని శక్తి పూర్తిగా బయటకు రావడం.. ఈ క్రమంలో వచ్చే ఫైట్ సీన్స్ అలరిస్తాయి. ద్వితీయార్ధంలో కథ మొత్తం.. శివ – గురు – జునూన్ పాత్రల మధ్యే తిరుగుతుంది. శివ గతానికి సంబంధించిన కథ హత్తుకుంటుంది. తనలో దాగున్న అగ్ని శక్తిని బయటకు తీసేందుకు అతను చేసే ప్రయత్నాలు కానీ, తన శక్తియుక్తులు తెలిసుకున్నాక వచ్చే ఎపిసోడ్లు అంతగా మెప్పించవు. మధ్య మధ్యలో వచ్చే లవ్‌ట్రాక్ కథను పక్కకు లాగేస్తుంటుంది. పతాక సన్నివేశాలు మాత్రం కనులవిందుగా ఉంటాయి. అయితే సినిమాను ముగించిన తీరు ఏమాత్రం రుచించదు.
ఎవరెలా చేశారంటే: శివ పాత్రకు రణ్‌బీర్ కపూర్ చక్కగా సరిపోయారు. ఇటు ప్రేమ సన్నివేశాల్లోనూ.. అటు యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ చక్కటి నటన కనబర్చారు. ఈషా పాత్రలో అలియా ఒదిగిపోయింది. ప్రేమ సన్నివేశాల్లో రణ్‌బీర్ – అలియాల కెమిస్ర్టీ చూడముచ్చటగా అనిపిస్తుంది. అయితే ఇలాంటి కథల్లో లవ్‌ట్రాక్స్ ఏమాత్రం సెట్ కావు. షారుఖ్ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్‌లో ఆయన అదరగొట్టారు. నాగ్ పాత్ర నిడివి తక్కువే అయినా.. ఆయన కనిపించినంత సేపు సినిమా మరోస్థాయిలో ఉంటుంది. ద్వితీయార్ధానికి అమితాబ్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో మౌనీరాయ్ చక్కటి నటన ప్రదర్శించింది.
చివరగా…దర్శకుడు అయాన్ విజువల్ ఎఫెక్ట్స్‌పై పెట్టిన శ్రద్ధ.. కథపై పెట్టలేదనిపిస్తుంది. శివ – ఈషాల లవ్‌ట్రాక్ బలవంతంగా ఇరికించినట్లు ఉంటుంది. సినిమాని రసవత్తరంగా నడిపించడానికి తగ్గ పాత్రలు బోలెడన్ని ఉన్నా.. వాటిని సరైన రీతిలో వినియోగించుకోలేకపోయాడు. ఈ చిత్ర విడుదలకు ముందే ఇది మూడు భాగాల సినిమా అని ప్రకటించేశారు. నిజానికి ఇలాంటి కథలకు ముగింపు చాలా కీలకం. అది రాబోయే భాగంపై అంచనాలు పెంచేలా ఉండాలి. కానీ, ఈ చిత్ర ముగింపు పూర్తిగా తేలిపోయింది. ప్రీతమ్ నేపథ్య సంగీతం ఏమాత్రం మెప్పించదు. పాటల్లో కుంకుమలా నువ్వే ఒక్కటే ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి.
బ్రహ్మాస్త్రం.. విజువల్స్ కోసమైనా చూడొచ్చు!
- రేటింగ్: 3/5