సిరిసిల్ల తనకు కొత్త కాదని.. ఇక్కడ అహంకార మంత్రి (కేటీఆర్ ) ఉన్నారని ఆరోపించారు సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమ. బీజేపీ వాళ్లపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. సిరిసిల్లలో బీజేపీ బలపడిందన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థేనని అన్నారు. ఇక్కడ యువరాజు గడి కోటలు బద్దలు కొడుతామన్నారు. బీజేపీ పార్టీ మహిళలకు, బీసీలకు పెద్దపీట వేసి.. సముచిత స్థానం కల్పిస్తోందన్నారు. సిరిసిల్లలో రాణి రుద్రమ మీడియా సమావేశం నిర్వహించారు. అంతకుముందు.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
తాను సిరిసిల్లలో పుట్టాక పోయిన ఈ ప్రాంత ప్రజలతో మంచి బంధాలు ఉన్నాయనీ, ఒక ఆడబిడ్డగా ఆదరించారన్నారు. తాను ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, కానీ ప్రతి ఒక్క కార్యకర్త ఎమ్మెల్యే అభ్యర్థినీ అన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశం కోసం ధర్మం కోసం పాటుపడతారన్నారు. పార్టీ ఆదేశాల మేరకు సిరిసిల్ల బరిలో ఉన్నానని, సిరిసిల్లలో అవినీతి పాలన అంతమొందిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు మోడీ నాయకత్వం కోసం చూస్తున్నారని, తనకు సిరిసిల్ల నుంచి పోటీ చేసే అవకాశం పార్టీ ఇచ్చిందన్నారు.అవకాశమిచ్చిన కేంద్ర, రాష్ట్ర పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సిరిసిల్ల బీజేపీ నాయకులు కార్యకర్తల అండదండలతో ప్రచారాన్ని ప్రారంభించి, సిరిసిల్ల గడ్డ పై కాషాయ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం తనపై ఉండాలని కోరుకున్నారు