ఇంగ్లీష్ మీడియంపై జనసేనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు పవన్ ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తుంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక మాత్రం సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న ఇంగ్లీష్ మీడియాన్ని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్వాగతించారు. చంద్రబాబు ప్రభుత్వం మధ్యలో వదిలేసిన ఇంగ్లీష్ మీడియాన్ని జగన్ ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తోందని రాపాక చెప్పారు.
అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు. పేద విద్యార్థుల కోసం వైసీపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. ప్రతిపక్ష నేత స్పీకర్‌ను గౌరవించాల్సిన బాధ్యత ఉందని రాపాక అభిప్రాయపడ్డారు. ఒకపక్క అధినేత పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియం విషయంలో ప్రభుత్వాన్ని ఏకరువు పెడుతున్న సమయంలో ప్రభుత్వానికి మద్దతుగా జేఎస్పీ ఎమ్యెల్యే రాపాక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.