2019 సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడి.. రెండు చోట్ల నిలపడిన ఆ పార్టీ అధినేత కూడా గెలవకపోయినా… సొంత ఇమేజ్ తో గెలిచిన రాపాక వరప్రసాద్.. డేర్ గా మాట్లాడారు! డేర్ టు రైట్ స్టాండ్ తీసేసుకున్నారు!! ఏకంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై అవాకులు చవాకులు పేల్చేశారు. ఆయనే విజయం సాధించలేదు అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
అవును… జనసేన తరుఫున గెలిచి అధికార పక్షం తరఫున మాట్లాడే ఎమ్మెల్యే రాపాక మరోసారి జనసేన పార్టీపైనా.. పార్టీ అధినేతపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందనీ.. ఇప్పుడు మళ్ళీ జగన్ హయంలో అభివృద్ధి నిరంతరాయంగా జరుగుతోందని స్పష్టం చేశారు.
అదేవిధంగా 2019లో వైఎస్సార్‌సీపీ తరపున టికెట్ కోసం ప్రయత్నించానని.. టికెట్ ఇవ్వడానికి జగన్ కూడా ఒప్పుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల టిక్కెట్ ఇవ్వలేకపోయారని జగన్ అన్నారని స్పష్టం చేశారు. ఆ విషయాన్ని వైఎస్ జగన్ స్వయంగా గెలిచిన మొదట్లో అన్నారని.. “సరే ఏదోలా నెగ్గావ్.. డోన్ట్ వర్రీ” అంటూ అభయమిచ్చారని వివరించారు. అయితే అప్పట్లో.. తప్పనిసరి పరిస్థితిలో రాజేశ్వరరావుకు వైసీపీ టికెట్ ఇచ్చారని.. అదే సమయంలో తాను ఖాళీగా కూర్చొని ఆలోచిస్తుంటే.. జనసేనకు సంబంధించిన కొందరు తన ఇంటికి వచ్చి పార్టీలో చేరమని ఆహ్వానించారని రాపాక చెప్పారు.
కాగా గతంలో రాజోలు నియోజకవర్గంలో ఎస్సీ ఓటింగ్ ఎక్కువ ఉండేదనీ, ఇప్పుడు కాపుల ఓటింగ్ పెరిగిందని అన్నారు. అలా జనసేన పార్టీలోకి వెళ్లిన తాను తర్వాతి పరిణామాలు చప్పక్కరలేదని కుండబద్ధలు కొట్టారు. ఇలా ఇప్పుడు వైసీపీలో కలిసి పని చేద్దామని జగన్ చెప్పారని వివరించారు. అయితే తమ నియోజకవర్గంలో వర్గాలు ఉన్నాయని.. ముగ్గురు పోటీలో ఉండగా.. జగన్ గారు త్వరలో మీటింగ్ పెట్టి ఒకరికి బాధ్యతలు అప్పగించనున్నారని కూడా తేల్చేశారు. జగన్ గారి మాటతో అంతా కలిసి పనిచేస్తున్నామని.. రాజోలు నియోజకవర్గానికి సీఎం జగన్ నిధులు కేటాయించారని తెలిపారు రాపాక వరప్రసాద్. అంతటితో ఆగకుండా తాను నెగ్గిన పార్టీ నిలబడేది కాదని.. ఉంటుందో లేదో కూడా తెలియదంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు రాపాక. మరి ఈ వ్యాఖ్యలపై జనసేన ఏమంటుందో చూడాలి!