బైక్ ట్యాక్సీ సర్వీస్ ప్రొవైడర్ ర్యాపిడో తన సేవలను బుధవారం నుంచి మళ్లీ ప్రారంభించింది. దేశంలోని 39 సిటీల్లో తమ సేవలను పునః ప్రారంభించామని ర్యాపిడో తెలిపింది. 11 రాష్ట్రాల్లో ర్యాపిడో సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయని ఆ కంపెనీ తెలియజేసింది. లాక్‌డౌన్ 4.0లో భాగంగా పలు ఆంక్షలకు సడలింపు ఇవ్వడంతో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.
అయితే ప్రస్తుతం కేవలం గ్రీన్, ఆరెంజ్ జోన్లలోనే తమ సేవలను ప్రారంభించామని, కంటెయిన్మెంట్ జోన్లలో ఎలాంటి సేవలను అందించడం లేదని.. ఆ కంపెనీ తెలిపింది. ఈ మేరకు ర్యాపిడో ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఇదే విషయమై కస్టమర్లకు తమ యాప్ ద్వారా నోటిఫికేషన్లు పంపుతున్నామని పేర్కొంది. ఇక యాప్‌ను వాడాలంటే ర్యాపిడో కెప్టెన్లు, కస్టమర్లు కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉండాలని ర్యాపిడీ తెలిపింది.
బైక్ ట్యాక్సీ సేవలను అందించే సమయంలో కరోనా జాగ్రత్తలను పాటిస్తామని ర్యాపిడో తెలిపింది. కెప్టెన్లు, కస్టమర్లు కచ్చితంగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని, ఇతర జాగ్రత్త చర్యలు పాటించాలని.. సూచించింది. ఇక ర్యాపిడో కెప్టెన్లు తమ బైక్‌లను తప్పనిసరిగా శానిటైజ్ చేయాల్సి ఉంటుంది.