గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, వ్యాపార,పారిశ్రామిక దిగ్గజాలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రతన్ టాటా మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ ద్వారా స్పందించిన షా.. ‘ప్రముఖ పారిశ్రామికవేత్త, నిజమైన జాతీయవాది అయిన రతన్ టాటా జీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను.
నిస్వార్థంగా మన దేశాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారు.నేను అతనితో కలిసిన ప్రతిసారీ, భారత ప్రజల అభ్యున్నతి పట్ల అతని ఉత్సాహం, నిబద్ధత నన్ను ఆశ్చర్యపరిచాయి. మన దేశం, ప్రజల సంక్షేమం పట్ల అతని నిబద్ధత మిలియన్ల కలలను వికసించేలా చేసింది. కాలం రతన్ టాటాని అతని ప్రియమైన దేశం నుంచి తీసివేయదు.ఆయన మన హృదయాలలో జీవించి ఉంటారు. టాటా గ్రూప్, దాని అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి శాంతి శాంతి’ అని ట్వీట్ చేశారు.