టాటా ట్రస్ట్ కు కుటుంబ సభ్యులు మాత్రమే చైర్మన్ కావాలనే నిబంధన ఏమీలేదని ఆ ట్రస్ట్ ప్రస్తుత చైర్మన్ రతన్ టాటా వెల్లడించారు. సుప్రీంకోర్టులో సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌కు ఆయన బదులిస్తూ.. భవిష్యత్తులో ఎవరైనా ట్రస్ట్‌కు చైర్మన్ కావొచ్చు అని పేర్కొన్నారు. టాటా కుటుంబానికి సంబంధించినంత వరకు టాటా సన్స్ కంపెనీపై ఎవరికీ ప్రత్యేక హక్కులు లేవని స్పష్టం చేశారు. మున్ముందు హ్యుమానిటీస్ నేపథ్యానికి చెందిన వారికి టాటా ట్రస్టులో ప్రాముఖ్యత ఇస్తామని తెలిపారు.
టాటా సన్స్, టాటా ట్రస్ట్ లకు నాయకత్వం వహించిన చివరి టాటా కుటుంబ వ్యక్తిగా రతన్ టాటా నిలిచే అవకాశం ఉంది. టాటా సన్స్ ప్రస్తుత చైర్మన్ టాటా కుటుంబానికి చెందినవాడు కాదని ఆయన సుప్రీంకోర్టులో పేర్కొన్నారు. టాటా ట్రస్ట్ ప్రతినిధి దేవాషిష్ రాయ్ మాట్లాడుతూ సాధారణ పరిస్థితులలో ట్రస్ట్ ప్రతి సంవత్సరం 1,200 కోట్లు స్వచ్ఛంద సంస్థ కోసం ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు.