లాక్‌డౌన్ సత్ఫలితాలపై ప్రధాని ఆశాజనకంగా ఉన్నారు. ముఖ్యమంత్రుల సూచనలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాని ముందుగా ప్రజలు, తర్వాతే ఆర్థికపరిస్థితి అని నిర్ధారణకు వచ్చినట్టే కనిపించింది.
దేశంలో కరోనా విజృంభణను స్వయంగా అనుభవిస్తున్న రాష్ట్రాలు, లాక్‌డౌన్ పొడిగింపుకే మొగ్గుచూపాయి. లాక్‌డౌన్ ఉంటేనే పరిస్థితి ఇలా ఉంటే, లేకపోతే మన గతేంటి? అనేది ప్రతి ముఖ్యమంత్రిని ఉలిక్కిపడేలాచేసింది. అందుకే కొందరు ముఖ్యమంత్రులు స్వంత నిర్ణయం తీసుకుని ఏప్రిల్ 30 దాకా లాక్‌డౌన్‌ను పొడిగించారు.
ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా అందరు ముఖ్యమంత్రులు ఇదే విషయాన్ని బలంగా వినిపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి, ప్రజల ప్రాణాల కంటే ఆర్థిక పరిస్థితి ముఖ్యం కాదు అన్న వాదన సమర్థవంతంగా అందరి మనసుల్లోకి జొప్పించగలిగారు. దాంతో ఏకీభవించిన ప్రధాని నేడు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా కేసీఆర్ మాటలనే తిరిగి చెప్పారు.
అయితే, ఏప్రిల్ 30 దాకా లాక్‌డౌన్ ప్రకటిస్తారని ఊహించిన ప్రజలు, మే 3 దాకా అనేసరికి అయోమయంలో పడ్డారు. ఇంకా మూడు రోజులు ఎందుకు పెంచారో చాలామందికి అర్థం కాలేదు. నిజానికి ఇందులో బ్రహ్మపదార్థమేమీ లేదు. మే 1 శుక్రవారం జాతీయ సెలవుదినం. 2వ తేదీ ఎలాగూ శనివారం. 3న ఆదివారం కావడంతో అందరికీ మూడు రోజలు సెలవులు లభించనున్నాయి. ఏప్రిల్ 30 నే లాక్‌డౌన్ ఎత్తేస్తే, ఈ మూడు సెలవు దినాలలో జనాలు విచ్చలవిడిగా రోడ్లపై వీరవిహారం చేసే అవకాశముందని భావించిన కేంద్రం, ఆ మూడు రోజులను కూడా లాక్‌డౌన్‌లో కలిపేసింది. సోమవారం 4 వ తేదీన అందరు ఎవరిపనుల్లోకి వారు వెళ్తారు కాబట్టి, పెద్దగా ఇబ్బందులుండవని ప్రధాని ఆశించారు… అంతే.
ప్రధాని సందేశం ముగిసిన వెంటనే, రైల్వేలు, విమానయాన శాఖలు తమతమ సర్వీసులను కూడా మే 3 దాకా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. అంతర్జాతీయ విమానయానాన్ని కూడా అనుమతించేది లేదని ఆ శాఖ స్పష్టం చేసింది.