చరిత్ర ఘనం.. ప్రస్తుతం శూన్యం..చెన్నై జట్టుకు ఏమైంది..?

-

ఐపీఎల్‌ ఆడిన ప్రతీసారి ప్లేఆఫ్స్‌ లేదా సెమీస్‌ చేరిన ధోనీసేన .. ఈసారి కనీసం రేసులో కూడా లేదు. లీగ్‌ దశలో ఇంకో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సివున్న చెన్నై మరో చెత్త ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్‌ ప్లేస్‌లో నిలించింది.గతంలో.. చెన్నై జట్టు ముందు కొండంత లక్ష్యం ఉన్నా ఛేజ్‌ చేస్తుందన్న ధైర్యం ఉండేది. చేజారిపోతున్న మ్యాచ్‌లనూ చేజిక్కించుకుంటుందనే ధీమా ఉండేది. కానీ.. ఇప్పుడు చేతిలోని మ్యాచ్‌లను ప్రత్యర్థులు లాగేసుకుంటున్నా ఏమీ చేయలేని స్థితిలో చూస్తూ ఉండిపోతోంది అసలు చెన్నై జట్టుకు ఏమైంది.


ప్రతీ సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్‌కు చేరుతూ అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు నిజంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్‌ ప్లేస్‌లో ఉంది. దీంతో ఈసారి నాకౌట్‌కు దాదాపు దూరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ధోనీ సేన మిగిలిన నాలుగు మ్యాచ్‌లను గెలవాల్సిందే. అప్పుడు ప్లే ఆఫ్‌ రేస్‌లో నిలవాలంటే ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. నెట్‌రన్‌రేట్‌ కూడా కీలకంగా మారుతుంది.

ధోనీసేన ఏకంగా ఎనిమిది సార్లు ఫైనల్స్‌కు చేరింది. మూడుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ను గెలిచింది. ప్రతిసారీ ప్లేఆఫ్‌ చేరిన ఏకైక జట్టు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత బలమైన జట్లలో ఒకటి. అందుకే.. అన్ని జట్లు ప్లేఆఫ్స్‌ తొలి లక్ష్యంగా బరిలోకి దిగితే చెన్నై మాత్రం నేరుగా ఫైనల్‌పై గురిపెట్టేది. క్రికెట్‌ పండితులు కూడా ఫైనల్‌లో ఒక బెర్తును ముందుగానే చెన్నైకి ఖాయం చేసేవారు. మిగిలిన స్థానం కోసం పోటీపడే జట్ల గురించి మాట్లాడేవారు.

అయితే.. ఈసారి పరిస్థితి మారింది. గత ఛాంపియన్‌కు ఇప్పుడున్న.. ధోనీసేన ప్రదర్శనకు చాలా తేడా ఉంది. టీ-20 ఫార్మాట్‌లో ఎదురొచ్చిన ప్రతి బంతినీ పరుగులు పెట్టించాలి. పవర్‌ప్లే, మధ్య ఓవర్లు, ఆఖరి ఓవర్లు అని తేడా లేకుండా బౌండరీలు బాదాలి. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచాలి. జట్టు ముందు కొండంత లక్ష్యం ఉన్నా ఆత్మవిశ్వాసంతో ఛేజ్‌ చేయాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పొట్టి క్రికెట్‌కు కావాల్సింది దూకుడు. చెన్నై జట్టులో అదే కొరవడింది.

కావాల్సినంత అనుభవం ఉన్నా.. దూకుడుగా ఆడే ఆటగాళ్లు లేరు. చివర్లో బౌండరీలు బాదే హిట్టర్లు కనిపించడంలేదు. వికెట్లు కాపాడుకొని చివరి ఓవర్లలో స్కోర్‌ బోర్డును పరిగెత్తిద్దాం అన్నట్లు ధోనీ సేన ఆటతీరు సాగింది. జట్టులో ఆటగాళ్లు ఇది టీ-20 అని మర్చిపోయారు. ధోనీ, జాదవ్‌ల టెస్ట్‌ బ్యాటింగ్‌ జట్టు కొంపముంచుతోంది. వికెట్లు కాపాడుకుంటే విజయం సాధించడానికి ఇది టెస్టు మ్యాచ్‌ కాదుగా..! అన్నింటికంటే ముఖ్యంగా ధోనీసేనలో గెలవాలనే కసి కనిపించలేదు. ఈ కారణంగానే ఈసారి కనీసం ప్లేఆఫ్స్‌ దరిదాపులో కూడా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news