ఎన్నడూ ఊహించని విధంగా మూసీ ప్రాజెక్టుకి అతి భారీ వరద వచ్చి పడింది. రికార్డ్ స్థాయిలో లక్షల క్యూసెక్కుల వరద నీరు పోటెత్తుతొంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి హఠాత్తుగా వరద పెరిగినట్టి చెబుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
సీఈతో సహా ముఖ్య అధికారులంతా ప్రాజెక్టు వద్ద ఉండాలని సూచించారు. నదీ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా అధికారులకు మంత్రి సూచనలు చేశారు. 13 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో: 1.83లక్షల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో : 1.58 లక్షల క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా 646.70 అడుగుల ప్రస్తుత నీటి మట్టం ఉంది. ఇప్పటికి పరిస్తితి అదుపులోనే ఉందన్న అధికారులు, వరద ఇంకా పెరిగితే. రత్నపురం వైపున కట్టకు గండి కొట్టే యోచనలో అధికారులు ఉన్నాడు.