ఈనెల 26 వరకు ఎర్రకోట మూసివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. ఈ నెల 10వ తేదీన ఎర్ర కోట మీద సుమారు 15 కాకులు చచ్చి పడి ఉన్నాయి. అయితే దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న నేపథ్యంలో వీటిని పరీక్షల నిమిత్తం తరలించారు. అయితే అందులో ఒక కాకికి బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు ఎర్రకోట ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇక గత వారం, ఢిల్లీలోని అనేక పబ్లిక్ పార్కులలో కాకులు, బాతులకి బర్డ్ ఫ్లూ సోకిందన్న సమాచారంతో ఢిల్లీ ప్రభుత్వం నగరం వెలుపల నుండి వచ్చే ప్రాసెస్ చేయబడిన మరియు ప్యాక్ చేసిన చికెన్ అమ్మకాన్ని నిషేధించింది. అంతే కాక తూర్పు ఢిల్లీల్లీలోని ఘాజిపూర్ పౌల్ట్రీ మార్కెట్ ను 10 రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నగరంలోని మునిసిపల్ కార్పొరేషన్లు ప్రాసెస్ చేసిన కోడి మాంసాన్ని అమ్మడం మరియు నిల్వ చేయడంపై తాత్కాలిక నిషేధం విధించాయి.