కరోనా మహమ్మారిపై పోరాటానికి పారిశ్రామిక వేత్తలు ఒక్కొక్కరూ ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ మహీంద్రా, అనిల్ అగర్వాల్ లాంటి వ్యాపారవేత్తలు ఇప్పటికే భారీ సహాయాన్ని ప్రకటించారు. ఇక తాజాగా ఈ జాబితాలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చి చేరింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని, అందుకు కావల్సిన సహాయ సహకారాలు అందిస్తామని ఆ సంస్థ తెలియజేసింది.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గాను అవసరం ఉన్న ఫేస్‌మాస్కులను రోజుకు 1 లక్ష చొప్పున ఉత్పత్తి చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. అలాగే కరోనా పేషెంట్లను తరలించేందుకు ఉపయోగించే వాహనాలకు ఉచితంగా ఇంధనం అందజేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. దీంతోపాటు లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయే వారికి ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తామని తెలిపింది.
ఇక ముంబైలో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు 100 పడకల ఆసుపత్రిని సిద్దం చేశామని రిలయన్స్ వెల్లడించింది. తమ సంస్థలో పనిచేసే కాంట్రాక్టు, టెంపరరీ ఉద్యోగులకు జీతాలను అందిస్తామని తెలిపింది. కాగా సోమవారం నాటికి భారత్‌లో 400కు పైగా కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం 9 మంది మృతి చెందారు.