టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొత్తగా జియో పేజెస్ పేరిట ఓ నూతన ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ప్రవేశపెట్టింది. జియో బ్రౌజర్ స్థానంలో జియో పేజెస్‌ను తీసుకువచ్చినట్లు జియో తెలియజేసింది. ఇది పూర్తిగా మేడిన్ ఇండియా బ్రౌజర్ కావడం విశేషం. దీంట్లో డేటా ప్రైవసీకి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. అలాగే యూజర్లకు ఈ బ్రౌజర్ లో సమాచారం షేరింగ్‌పై పూర్తి స్థాయిలో కంట్రోల్ ఉంటుంది.
జియో పేజెస్ బ్రౌజర్ బాగా వేగంగా పనిచేసేలా దీంట్లో క్రోమియం బ్లింక్ ఇంజిన్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల యూజర్లకు అద్భుతమైన ఫీల్ వస్తుంది. వెబ్ పేజీలు చాలా వేగంగా లోడ్ అవుతాయి. వీడియోలను ఎలాంటి ఇబ్బంది లేకుండా స్ట్రీమింగ్‌లో వీక్షించవచ్చు. ఎమోజీలకు సపోర్ట్‌ను అందిస్తున్నారు.
జియో పేజెస్ బ్రౌజర్‌లో హోం స్క్రీన్‌ను యూజర్లు తమకు ఇష్టం వచ్చినట్లుగా మార్చుకోవచ్చు. గూగుల్, బింగ్, ఎంఎస్ఎన్, యాహూ వంటి సెర్చ్ ఇంజిన్లలో ఏదైనా ఒక దాన్ని డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా సెట్ చేసుకోవచ్చు. హోం స్క్రీన్‌పై ఫేవరెట్ వెబ్‌సైట్లకు చెందిన లింక్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవే కాకుండా పర్సనలైడ్జ్ థీమ్, పర్సనలైజ్డ్ కంటెంట్, ఇన్ఫర్మేటివ్ కార్డ్స్, రీజనల్ కంటెంట్, అడ్వాన్స్‌డ్ డౌన్‌లోడ్ మేనేజర్, సెక్యూర్డ్ ఇన్‌కగ్నిటో మోడ్, యాడ్ బ్లాకర్ తదితర ఇతర ఆకట్టుకునే ఫీచర్లను కూడా దీంట్లో ఇస్తున్నారు. ఈ బ్రౌజర్ ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రస్తుతం లభిస్తోంది.