ఓ వెలుగు వెలిగిన ఆ నేతలంతా మసకబారిపోయారా…! 

పాలమూరు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన పలువురు నేతలు … ఓ వెలుగు వెలిగిన ఉద్దండులు ఇప్పుడు మసకబారిపోయారు. మారిన రాజకీయ పరిస్థితులతో పాటు పార్టిలో ప్రాధాన్యత తగ్గడం, మారిన ట్రెండ్ కు తగ్గట్లు అప్టేడ్ కాకపోవడంతో పలువురు నేతలు ఫేడ్ అవుట్ అయినట్లు తెలుస్తోంది . ఉన్న పార్టిని వీడి కొందరు , వీడక మరికొందరు కాలం వెల్లదీస్తున్నారు.

నాగం జనార్దన్ రెడ్డి ఈ పేరు ఇటు తెలంగాణ లో , అటు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో పరిచయం అక్కర లేని పేరు. తన రాజకీయ ప్రస్థానంలో ఓటమి కంటే గెలుపే నాగం ను ఎక్కువగా వరించందనడం లో సందేహం లేదు. అలాంటి అపార రాజకీయ అనుభవం ఉన్న నాగం కు ఇప్పుడు రాజకీయంగా గడ్డు కాలమే అని చెప్పవచ్చు. జ‌న్మ‌తహ కాంగ్రేస్ వ్య‌తిరేకిని అని చెప్పుకొచ్చిన నాగం జ‌నార్ద‌న్ రెడ్డి 2018 లో కాంగ్రేస్ తీర్దం పుచ్చుకొని బరిలో నిలిచినా ఓటమి పాలయ్యారు. ఓ వెలుగు వెలిగి చక్రం తిప్పిన నేత నాగం శకం 2014తో ముగిసినట్లు రాజకీయ విశ్లేషకులు విశ్లేశిస్తున్నారు.

యెన్నం శ్రీనివాసరెడ్డి…మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేశ్వ‌ర్ రెడ్డి అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో బిజెపి తరుపున బరిలో దిగి ఎమ్మెల్యే అయ్యారు. ప‌నిచేసింది త‌క్కువ కాలమే అయినా బిజెపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కినా కనీసం పాలమూరు గడ్డ పై అడుగు పెట్టలేదనే విమర్శలు సొంత పార్టి నుంచే వస్తున్నాయి .

పాలమూరు జిల్లా రాజకీయాల్లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన ఫేడ్ అవుట్ అయిన మరో నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి . టిఆర్ఎస్ లో చేరిన తరువాత గుర్నాథ్ రెడ్డి రాజకీయ భవిష్యత్ కామాలు , పులిస్టాప్ ల మాదిరిగానే ఉంది.

నాలుగు సార్లు నాగర్ కర్నూలు ఎంపి గా ప్రాతినిధ్యం వహించి, జిల్లా మరియు జాతీయ రాజకీయాల్లో గుర్తింపు పొందిన మందా జగన్నాధం పాలమూరు జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ గా లేనట్లు కనిపిస్తోంది . టిఆర్ఎస్ లో చేరిన తరువాత 2014ఎన్నికల్లో తాను నాగర్ కర్నూలు ఎంపిగా , తన కుమారుడు అలంపూర్ ఎమ్మెల్యేగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు ఎంపి టికెట్ మందా కు దక్కలేదు. దీంతో గత కొంత కాలంగా మందా సైలెంట్ అయినట్లు కనిపిస్తోంది

ఇక వనపర్తి ఎమ్మెల్యేగా రెండు సార్లు , ఒకసారి రాజ్యసభ సభ్యుడుగా పనిచేసి , తెలుగుదేశం పార్టి జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న రావుల చంద్రశేఖర్ రెడ్డి , ఇటు జిల్లా రాజకీయాలతో పాటు టిడిపి హయాం లో రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేతే… ఇప్పుడాయన సైలెంట్ అయిపోవడం తో పాటు వనపర్తి కి ముఖం చాటేశారు. లీడర్లు , క్యాడర్ లేక పోవడం తో భవన్ కే పరిమితమై అడపాదడపా .. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.

మక్తల్ నియోజక వర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొంది , తెలుగుదేశం హయాంలో జిల్లాలో చక్రం తిప్పిన నేత కొత్తకోట దయాకర్ రెడ్డి. అప్పట్లో ఆయన భార్య జడ్పి చైర్మన్ గా పనిచేయడం తో పాటు దేవరకద్ర నియోజక వర్గానికి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 నుంచి 2014 వరకు భార్య భర్తలిద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. . అయితే 2014 ఎన్నికల్లో దయాకర్ రెడ్డి దంపతులు ఓటమి పాలయ్యారు. ఒకప్పుడు రెండు నియోజకవర్గాలను శాసించిన వ్యక్తి ఇప్పుడు మాత్రం అంత క్రీయశీలకంగా వ్యవహరించడం లేదు.