నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య హోరాహోరీగా ప్రచారం సాగుతోంది. దేశంలోని వలస, లోకల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా భారత మూలాలున్న కమలా హారిస్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటునాటు’ పాటను ఎన్నికల ప్రచారంలో తెగ వాడేసుకుంటున్నారు. ‘నాటు నాటు’ పాట స్ఫూర్తితో హిందీలో ‘నాచో నాచో’ గీతాన్ని రూపొందించగా.. దానిని భారత-అమెరికన్ లీడర్ అజయ్ భుటోరియా విడుదల చేశారు.
అజయ్ భుటోరియా మాట్లాడుతూ..’నాచో నాచో’ కేవలం సాంగ్ మాత్రమే కాదని..ఇదొక ఉద్యమమని పేర్కొన్నారు.దక్షిణాసియా అమెరికన్ కమ్యూనిటీతో అనుసంధానం కావడమే తమ ప్రచార లక్ష్యమన్నారు.ఎన్నికల్లో ఓటు వేయడానికి 4.4 మిలియన్ల ఇండియన్ అమెరికన్ ఓటర్లు, 6 మిలియన్ల దక్షిణాసియా ఓటర్లు అర్హత కలిగి ఉన్నారని..కమలా హారిస్‌కు మద్దతుగా వీరిని కూడగట్టడమే తమ ముందున్న అతిపెద్ద లక్ష్యం అని చెప్పారు.
కాగా, 2020 యూఎస్ ఎన్నికల్లో దక్షిణాసియా, ఆఫ్రికన్ అమెరికన్ సంతతికి చెందిన మహిళ కమలా హ్యరీస్‌ను తొలి వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడం ద్వారా చరిత్ర సృష్టించామని..ఇప్పుడు ఆమె దేశానికి అధ్యక్షురాలు అయితే మరో రికార్డు ఖాయం అన్నారు.ఈసారి కమలా గెలిస్తే 248 ఏళ్ల అమెరికా చరిత్రలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టిస్తారని తెలిపారు.