రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనిగురించి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. ఇక అటు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద ఉధృతి కొనసాగుతుండగా అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు బుడమేరు వాగు కాలువకు గండ్లను అధికారులు వేగంగా పూడ్చుతున్నారు. మరోసారి భారీ వరదలు వచ్చినా తట్టుకునేలా అధికార యంత్రాంగం కాలువ నిర్మాణం చేపడుతోంది.
తాజాగా బుడమేరు గండ్ల మరమ్మతులు, దానికి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. బుడమేరుకు రిటైనింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదన చేస్తున్నట్లు తెలిపారు. కాలువల ఆక్రమణల వల్లే వరద తీవ్రత పెరిగిందని వెల్లడించారు.ప్రస్తుతం బుడమేరుకు గండ్లు పూడ్చినందున మళ్లీ వరద వచ్చే అవకాశం లేదని, విజయవాడ ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. అయితే, కాలువకు కెపాసిటీకి మించి వరద వచ్చినట్లు అయితే మరోసారి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.