భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగించారని అన్నారు టిపిసికి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఉదయించే సూర్యుడిలా తెలంగాణలోకి ఎంటర్ అయిన రాహుల్ గాంధీకి చారిత్రాత్మకమైన హైదరాబాద్ నగరం ఘనంగా స్వాగతం పలికిందన్నారు. అపనమ్మకంతో ఉన్న సమాజానికి రాహుల్ గాంధీ భరోసా కల్పించారని తెలిపారు. జోడోయాత్రలో నా బాధ్యత సంపూర్ణంగా నిర్వహించానని తెలిపారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు రేవంత్ రెడ్డి.
మునుగోడు ఉపఎన్నికలలో మేము గెలిచామని సంబరాలు చేసుకుంటున్నారని.. కానీ స్వతహాగా తాను గెలవలేను అని ఒప్పుకున్నారని అన్నారు. కమ్యూనిస్టుల శరణు జొచ్చి గెలిచారని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టులు లేరని చెప్పిన సీఎం కేసీఆర్ కి ఇప్పుడు వాళ్లే దిక్కు అయ్యారని అన్నారు. ఇక బిజెపి బరితెగించిందని.. నడి బజారులో నగ్నంగా నిలబడిందని మండిపడ్డారు. మద్యం పంచి, వందల కోట్ల డబ్బులు పంచి మునుగోడుని మద్యం అమ్మకాలలో నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టిందని ఆరోపించారు. టిఆర్ఎస్, బిజెపి రెండు కలిసి 300 కోట్ల మద్యం తాగించారని ఆరోపించారు. ఈ పాపంలో మా పాత్ర లేదన్నారు రేవంత్ రెడ్డి.