కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపేందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్రను ప్రారంభించింది. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో పూజలు చేసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. మేళతాళాలతో రేవంత్‌రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వన దేవతలకు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, పార్టీ నేతలు పూజలు చేశారు. సమ్మక్క-సారలమ్మ దర్శనానికి ముందు జాకారం గట్టమ్మ గుడి, సాయిబాబా దేవాలయాన్ని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.
అనంతరం ములుగు జిల్లా ప్రాజెక్ట్‌నగర్‌లో రేవంత్‌రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాచరిక పాలన మీద పోరాటం చేసిన సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో మేడారం నుంచి యాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్ట సభల్లో మాట్లాడే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ ఎవరు చెప్పింది వినరని.. ఆయనకు తెలియదని విమర్శించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని రేవంత్ ఆరోపించారు.
”తెలంగాణలో సంపూర్ణ మార్పు కోసం యాత్ర చేపట్టాం. రాచరికం మీద పోరాటం చేసిన సమ్మక్క-సారాలమ్మ స్ఫూర్తితో మేడారం నుంచి యాత్ర చేపట్టాం. సీఎం కేసీఆర్ పీడ విరగడ కోసమే ఈ యాత్ర చేస్తున్నాం. బడ్జెట్‌పై ఎప్పుడూ కేసీఆర్ అబద్ధాలే చెబుతారు. కేసీఆర్ వచ్చాక 30 శాతం బడ్జెట్‌లో తేడా వచ్చింది. ఇచ్చేది ఏమి లేదు కాబట్టి రాసుకోరా సాంబా అంటే హరీశ్ రాసుకుని చదివిండు.”-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు