సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. నేడు గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు అయ్యాక సీఎం కేసీఆర్ కన్ను హైదరాబాద్ లోని భూములపై పడిందన్నారు. భూములు కావలసిన వాళ్లకు అప్పనంగా ఇస్తున్నారని ఆరోపించారు. యశోద ప్రైవేట్ వాసుపత్రికి 15 ఎకరాల భూమిని సీఎం కేసీఆర్ కేటాయించాడని.. రూ. 800 కోట్లు యశోద కొల్లగొట్టిందన్నారు.
ఈ వ్యవహారంలో కేసీఆర్ బంధువు కల్వకుంట్ల జగన్నాథరావుకు ప్రమేయం ఉందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. అలెగ్జాండ్రియాకి కేటాయించిన 5 ఎకరాల భూమి యశోద వాళ్లు 2016లో ఆక్రమించారని అన్నారు. కల్వకుంట్ల జగన్నాథరావు, రవీందర్ రావులు అలెగ్జాండ్రియా కంపెనీని బెదిరించి ఆక్రమించారని సంచలన ఆరోపణలు చేశారు.
ఇక ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన వ్యక్తుల భూభాగోతం రేపు బయటపెడతానన్నారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ తనకి జన్వాడలో భూమి లేదన్నాడని.. తాను డాక్యుమెంట్ తో సహా బయటపెట్టాక మళ్ళీ మాట్లాడలేదన్నారు. డ్రగ్స్ టెస్ట్ కి మేము సిద్ధమని సవాల్ విసిరితే కేటీఆర్ పారిపోయాడని అన్నారు. తాను తప్పుడు ఆరోపణలు చేస్తే ఏ శిక్ష కైనా సిద్ధం అన్నారు రేవంత్ రెడ్డి.