తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్..పేర్ని నాని, కేసీఆర్ లకు రేవంత్ రెడ్డి వార్నింగ్..!

సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ మీటింగ్ లో ఆసక్తి కర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో దళిత బంధు పథకం కావాలని కోరుకుంటున్నారని.. అదే విధంగా టిఆర్ఎస్ పార్టీని ఏపీలో కూడా పెట్టాలని రిక్వెస్ట్ లు వస్తున్నాయని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ మంత్రి పేర్ని నాని కెసిఆర్ పార్టీ పెడితే తాము స్వాగతిస్తామని అన్నారు. అయితే రెండు ప్రాంతాలను కలిపేలా ఆయన ఒక తీర్మానం చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే కేసీఆర్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కెసిఆర్ రాజ్య విస్తరణ కాంక్షతో తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్లీనరీలో తెలుగు తల్లి ప్రత్యక్షమవడం… మంత్రి పేర్ని నాని సమైక్య ప్రతిపాదన చేయడం.. సీఎం కేసీఆర్ జగన్ ల ఉమ్మడి కుట్ర అని వ్యాఖ్యానించారు. వందల మంది ఆత్మబలిదానాల తో ఏర్పడిన తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.