మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ఉప ఎన్నికలలో విజయం సాధించి భవిష్యత్తులో ఎన్నికలకు పట్టు సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి ఈ ఉపఎన్నిక అత్యంత కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఉపఎన్నిక పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికపై ఫోకస్ పెట్టారు.
నేడు ( శనివారం) సీఎం కేసీఆర్ సిపిఐ మద్దతుతో బహిరంగ సభ పెడుతుండగా.. ఆదివారం బిజెపి తరఫున అమిత్ షా ప్రచారం చేయనున్నారు. ఇక కాంగ్రెస్ తరపున టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటింటికి క్యాంపియన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి తిరిగి వస్తే పార్టీ టికెట్ ని ఆయనకే ఇస్తామని తెలిపారు. ఆయనకు పార్టీ తరఫున బీఫామ్ ఇవ్వడంతో పాటు సీనియర్ నేతల్తొ కలిసి ఆయనను గెలిపించుకుంటామని వెల్లడించారు.