రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను రెవెన్యూ ఉద్యోగులు, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వేర్వేరుగా కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు కేటీఆర్‌కు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్-ట్రెసా నాయకులు వినతి పత్రం సమర్పించారు. రెవెన్యూ శాఖలో విధులు, పని భారాన్ని అనుసరించి నూతన కేడర్‌ను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పదోన్నతులు, ధరణి సమస్యలు, వీఆర్ఏలకు పేస్కేల్ వంటి అంశాలపై కేటీఆర్‌కు వినతి పత్రం అందించారు. రెండు రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని మంత్రి కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.
మరోవైపు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ప్రభుత్వ హామీ మేరకు ఆర్టీసీలో యూనియన్లకు అనుమతికి, పేస్కేల్ అమలు, సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ విషయంపై కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరలోనే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.