రివ్యూ: కంబాల పల్లి కథలు ఛాప్టర్ 1 మెయిల్

-

రివ్యూ:

సినిమా: కంబాల పల్లి కథలు ఛాప్టర్ 1 మెయిల్
బ్యానర్: స్వప్నా సినిమాస్
నిర్మాత: ప్రియాంకా దత్
దర్శకుడు: ఉదయ్ గుర్రాల
నటీనటులు: ప్రియదర్శి, హర్షిత్ మల్గిరెడ్డి, గౌరీ ప్రియ, రవీందర్ బొమ్మకంటి, మణి
సాంకేతిక వర్గం: డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ- ఉదయ్ గుర్రాల, శ్యామ్ దూపాటి
సంగీతం : స్వీకర్ అగస్థి
ఎడిటర్: హరి శంకర్ టీఎన్
నేపథ్య సంగీతం: కామ్రాన్

స్ట్రీమింగ్: ఆహా

కథ:

2005.. ఊర్లలో కంప్యూటర్ పరిచయం అవుతున్న రోజులు. ఆ టైమ్ లో కంప్యూటర్ నేర్చుకుందామన్న ఉత్సాహంతో హీరో రవి(హర్షిత్), అదే ఊర్లో గేమింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన హైబత్ (ప్రియదర్శి) దగ్గరికి వెళ్ళి నేర్పమని అడుగుతాడు. దానికి ఒప్పుకున్న ప్రియదర్శి, రవికి మెయిల్ క్రియేట్ చేసి ఇస్తాడు. ఆ మెయిల్ వల్ల రవి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. దాన్నుండి ఎలా బయటపడ్దాడనేదే కథ.

విశ్లేషణ:

ఇప్పుడు 2021నడుస్తుంది. పదిహేనేళ్ళ క్రితం నాటి కథని తీసుకున్న దర్శకుడు అందులో ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమా చూస్తున్నంత సేపు అదే కాలంలో ఉన్నట్టు అనిపిస్తుంది. పల్లెటూరి యువకుల్లో ఉండే అమాయకత్వం, అందులోంచి వచ్చే కోపం, అమ్మానాన్నలతో వాళ్ళు మాట్లాడే మాటలు చాలా చక్కగా చూపించారు. ముఖ్యంగా సినిమాలో సంభాషణలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. హీరోయిన్ పాత్ర కొంచెం సేపే ఉన్నా ఆకట్టుకుంది. కంప్యూటర్ కి వైరస్ ఎలా వస్తుందో తెలియని హైబత్ పాత్ర, అది తీసేయడానికి ఐదు వందలు చెల్లించుకునే సన్నివేశం బాగా నవ్వు తెప్పిస్తుంది. ఇలాంటి సన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయి. కంప్యూటర్ ఆన్ చేసినపుడు వచ్చే శబ్దం ఎక్కడిదో కనిపెట్టలేక పడే టెన్షన్, సహా ఇతర సీన్లు నవ్వు తెప్పిస్తాయి. పాటలు పాటల్లా కాకుండా నేపథ్యంలో కలిసిపోయాయి.

ఎవరెలా చేసారంటే:

హీరో హార్షిత్ రవి పాత్రలో ఒదిగిపోయాడు. అతని ఫ్రెండ్ సుబ్బు పాత్రలో చేసిన మణికి మంచి మార్కులే ఇవ్వాలి. పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన హీరోయిన్ గౌరీ ప్రియ చాలా చక్కగా చేసింది. కనిపించిన కొన్ని సన్నివేశాల్లో అయినా ఆకర్షిస్తుంది. హీరో పక్కన ఉండే సుబ్బు( మణి) పాత్ర నవ్విస్తుంది. శివన్న పాత్రలో చేసిన రవీందర్ బొమ్మకంటి గుర్తుండిపోతాడు. ఇక ప్రియదర్శి, తనకు ఇచ్చిన పాత్రకి న్యాయం చేసాడు. ప్రతీ పాత్ర అర్థవంతంగా ఉండడమే కాదు, 2005కి తిరిగి వెళ్ళినట్లు చేసింది. ఈ విషయంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది.

తీర్పు:

సినిమా నెమ్మదిగా సాగినప్పటికీ వినోదాన్ని అందించింది. కంప్యూటర్ వచ్చిన కొత్తలో ఊర్లల్లో దాన్నెలా చూసేవారో, దాన్నుండి వచ్చే సందేశాలను ఎంత సీరియస్ గా తీసుకునేవారో అచ్చంగా చూపించింది. కాలంలో ప్రయాణం చేసే పరికరం ఇంకా కనిపెట్టబడలేదు. కానీ వెనక్కి వెళ్ళిన కాలాన్ని మన ముందు నిలిపేది సినిమా. ఈ మాట కంబాల పల్లి కథలు ఛాప్టర్ 1 మెయిల్ చూసాక నిజమే అనిపిస్తుంది.

చివరగా,

మెయిల్ తెచ్చిన వినోదం.

Read more RELATED
Recommended to you

Exit mobile version