ఈఏపీ (ఎక్స్‌టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్)పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. న్యూడెవలప్‌మెంట్ (ఎన్డీబీ)బ్యాంకు, ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ బ్యాంకుల రుణ సహాయంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులనూ సమీక్షించిన సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు పనుల్లో అలసత్వం లేకుండా చూసుకోవాలన్నారు.
నిర్దేశిత సమయంలోగా వివిధ ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని.. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర వంటి కరవు ప్రాంతాల్లో చెరువులను కాల్వల ద్వారా అనుసంధానం చేయాలని తెలిపారు.
నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని చెరువుల పరిస్థితి పై అధ్యయనం చేయాలని.. ఒకవేళ అవసరమైన చోట చెరువులు లేకపోతే కొత్తగా చెరువులు నిర్మించాలని వివరించారు.
ఈ చెరువులు అన్నింటినీ గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయాలని… దీని వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. పర్యావరణ సమతుల్యత ఉంటుందన్నారు. అలాగే.. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో మూడు పోర్టులు కడుతున్నామని.. వీటి చుట్టు పక్కల అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయని వివరించారు. వాటి పరిధిలో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం చాలా అవసరమని.. దీని వల్ల పోర్టు ఆధారితంగా అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.