ధాన్యాన్ని మిల్లుల్లో దించుకున్నప్పుడు 17 శాతంగా ఉన్న తేమ శాతం మూడు నెలలు గడిచిన తర్వాత 12 శాతానికి తగ్గిందని రైస్ మిల్లర్లు అంటున్నారు. ధాన్యం బరువు తగ్గిందని, ఈ అంశంతో తమకు సంబంధం లేదని రైస్ మిల్లర్ల సంఘం స్పష్టం చేసింది. యాసంగి ధాన్యాన్ని వీలైనంత త్వరగా వేలం వేయాలని సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కు విజ్ఞప్తి చేసింది. రైస్‌మిల్లుల ప్రాంగణాలు, గోదాముల్లో ఎలా ఉన్న ధాన్యాన్ని అలాగే వేలం వేసే విధంగా, నోటిఫికేషన్ ఇవ్వాలని.. ఎఫ్‌ఏక్యూ (ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ) ప్రమాణాలతో నిమిత్తం లేకుండా ఉండాలని కోరింది.
ఈ మేరకు రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు గురువారం రోజున లేఖ రాశారు. ఆలస్యమయ్యేకొద్దీ మరింత నష్టం వాటిల్లుతుందని అన్నారు. అందువల్ల వెంటనే ధాన్యాన్ని వేలం వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. యాసంగి ధాన్యం అకాల వర్షాలతో పలుమార్లు తడిసి.. రంగుమారిందని.. కొన్నిచోట్ల మొలకెత్తిందని తెలిపారు. ఈ ధాన్యంతో ఎఫ్‌సీఐ నిర్దేశించిన ప్రమాణాల్లో బియ్యాన్ని ఇవ్వడం సాధ్యం కాదని లేఖలో స్పష్టం చేశారు.