కృష్ణా,గుంటూరులో పెరుగుతున్న కేసులు..ఏపీలో మరోసారి లాక్‌డౌన్ ?

Join Our COmmunity

ఏపీలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేయాలని జగన్ సర్కారు భావిస్తోందా?. ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఉత్తరాది రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ మొదలైంది. ఏపీలో సెకండ్ వేవ్‌ వస్తే.. పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని వైద్య ఆరోగ్య శాఖలో చర్చ జరుగుతోంది. మళ్లీ లాక్‌డౌన్ అమలు చేస్తే.. అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ తట్టుకోగలదా అన్న చర్చ ఏపీ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తుంది.

ఏపీలో గతంతో పోల్చుకుంటే కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినా.. లెక్కలు చూసి సంబరపడే పరిస్థితి లేదంటున్నారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు. కేసుల సంఖ్య తగ్గినా.. కృష్ణా- గుంటూరు జిల్లాల్లో కేసులు పెరుగుతున్న తీరు ప్రమాదకరంగా కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని కృష్ణా-గుంటూరు జిల్లాలు భర్తీ చేస్తున్నాయి. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో కేసులు పెరుగుతున్న తీరుతో వైద్యారోగ్య శాఖ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలన్నీ కరోనా సెకండ్ వేవ్ ప్రారంభానికి ముందున్న సంకేతాలుగా భావిస్తున్నాయి వైద్యారోగ్య శాఖ వర్గాలు.

డిసెంబర్‌లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగవచ్చనే అంచనాలు ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి. సెకండ్ వేవ్ అంటూ రావడం జరిగితే భారీగా ఉండవచ్చు. ప్రభుత్వం స్కూళ్లను తెరిచింది. వివిధ రంగాల్లో అన్‌లాక్ ప్రక్రియ మొదలైంది. అయితే సెకండ్ వేవ్ భయాందోళనలు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో మరోసారి లాక్‌డౌన్ విధిస్తే ఎలా ఉంటుందనే దానిపై ఏపీ వైద్యారోగ్య శాఖ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం.

ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగించడంతోపాటు.. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తిరిగి లాక్ డౌన్ అమలు దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న విషయాన్ని వైద్యారోగ్య శాఖ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో కూడా లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉందా..? అనే కోణంలో ప్రాథమిక స్థాయిలో చర్చ జరుగుతోన్నట్టు తెలుస్తోంది.

వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు లాక్‌డౌన్ గురించి చర్చిస్తుంటే.. ఆర్థిక శాఖ రాష్ట్రంలో పరిస్థితుల గురించి మధన పడుతోంది. రాష్ట్రాన్ని మరోసారి లాక్‌డౌన్ చేయాలంటే వైద్యారోగ్య శాఖ సూచనలతో పాటు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా బేరీజు వేసుకోవాలని అంటున్నారు. ఏపీ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది. ప్రతి పనికీ అప్పుల కోసం బ్యాంకుల వైపు చూస్తున్న పరిస్థితి. అన్‌లాక్ తర్వాత ఇప్పుడిప్పుడే ఒక్కో రంగం గాడిన పడింది. లాక్ డౌన్ వల్ల అత్యంత నష్టపోయిన రాష్ట్రాల జాబితాలో ఏపీ ముందుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలడం ఖాయమనే భావన వ్యక్తమవుతోంది.

వైద్యారోగ్య శాఖ వర్గాల నుంచి లాక్ డౌన్ తరహా ప్రతిపాదనలు వచ్చినా.. ప్రభుత్వ ఆమోదం సందేహమే. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని… ఇప్పుడు లాక్‌డౌన్ పెట్టి రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాల్సిన అవసరం లేదనే భావన ప్రభుత్వ వర్గాల్లో కన్పిస్తోంది.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news