ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ విఫలం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 578 పరుగులకు ఆలౌట్ అవ్వగా వెంటనే భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ 9 బంతుల్లో 1 ఫోర్‌తో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడబోయిన రోహిత్ బంతికి ఎడ్జ్ ఇచ్చాడు. దీంతో వికెట్ కీపర్ బట్లర్ క్యాచ్ పట్టాడు. అయితే రోహిత్ నిజానికి గత 7 టెస్టు మ్యాచ్‌లలోనూ మొత్తం కలిపి 23.1 సగటుతో కేవలం 162 పరుగులు మాత్రమే చేశాడు. వాటిల్లో ఒక్కసారి మాత్రమే 50కి పైగా స్కోరు సాధించాడు. రోహిత్ ఇలా వరుసగా టెస్టు మ్యాచ్‌లలో విఫలం అవుతుండడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వన్డేలు, టీ20ల్లో హిట్ మ్యాన్‌గా పేరుగాంచిన రోహిత్ టెస్టుల్లో మాత్రం విఫలం అవుతుండడంపై అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అతన్ని వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించి, రహానేకు ఆ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 63 పరుగుల స్కోరు వద్ద కొనసాగుతోంది. క్రీజులో పుజారా, కోహ్లి ఉన్నారు.